Telangana: సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్! తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government)లో sib లో కీలకంగా పనిచేసిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Telangana CM Revanth Reddy: హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government)లో sib లో కీలకంగా పనిచేసిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో (special Intelligence branch) పేరుతో అధికార దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీస్ శాఖ (Telangana Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న డీఎస్పీ ప్రణీత్ రావ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనపై రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకున్నారు.
అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ సైతం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు సైతం చేశారు. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ కీలక నేతల ఫోన్లను ట్యాంపరింగ్ చేసినట్లు సస్పెన్షన్‌కు గురైన డీఎస్పీ ప్రణీత్ రావ్ పై ఆరోపణలు ఉన్నాయి. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. గతంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ప్రణీత్ కుమార్ ను విధుల నుంచి తప్పించారు. ప్రణీత్ రావును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి స్థాయి దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.