విమానం మొత్తం ముగ్గురే ప్రయాణికులు.. ప్రత్యేకంగా బుక్ చేసింది కాదు... టికెట్ రేటూ పెరగలేదు.... సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఎన్ఆర్‌ఐ ఫ్యామిలీ
తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐ కుటుంబం హైదరాబాద్ నుంచి షార్జాకు చేసిన ప్రయాణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వాళ్లు ప్రయాణించింది ప్రైవేటు విమానంలో కూడా కాదు. మరి ఎందుకిది వార్తల్లో నిలిచింది?
తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ కుటుంబానికి భలే అనుభవం ఎదురైంది. 180 మంది ప్రయాణించాల్సిన విమానంలో ఎంచక్కా ముగ్గురు మాత్రమే ప్రయాణించే ఛాన్స్ దొరికింది. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం లభించింది.
కోవిడ్ ఆంక్షల కారణంగా యూఏఈ ప్రభుత్వం విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రత్యేక రంగాల వారికి మాత్రం ఆంక్షలను ఇస్తూ ఇటీవల సడలింపులు చేసింది. దీంతో తెలంగాణ నుంచి యూఏఈకి ఎయిర్ బస్- 320 విమానం బయల్దేరింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షార్జాకు బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 180 మంది ప్రయాణించాల్సి ఉంది. కానీ కేవలం ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఇందులో ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక కుటుంబానికి చెందిన వారు మాత్రమే ఈ ట్రిప్‌లో పాల్గొన్నారు.
విమానాలను రద్దు చేయడంతో..
కరీంనగర్‌కు చెందిన డాక్టర్ హరితా రెడ్డి షార్జాలోని ఇస్మైల్ హెల్త్‌కేర్ గ్రూప్‌లో చైల్డ్ హెల్త్ ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీకి యూఏఈ కంట్రీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హరిత తండ్రి చనిపోవడంతో వీరు ఏప్రిల్ 18వ తేదీన వరంగల్ వచ్చారు. ఇక్కడికి వచ్చిన వారం తర్వాత యూఏఈ ప్రభుత్వం భారత్ నుంచి తమ వద్దకు వచ్చే విమానాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో హరిత కుటుంబం ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.
హరిత కుటుంబం 2021 జనవరిలోనే కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఆ తర్వాత మూడు సార్లు తెలంగాణకు వచ్చి వెళ్లారు. చివరిసారి వచ్చినప్పుడు యూఏఈ విమానాలను రద్దు చేయడంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు 6 సార్లు టికెట్లను బుక్ చేసుకోగా.. ప్రతిసారీ రద్దయ్యాయి.
దుబాయ్‌లోని హెల్త్ అథారిటీ సాయంతో..
హరిత డాక్టర్ కావడంతో ప్రత్యేక అనుమతి లభించింది. దుబాయ్‌లోని హెల్త్ అథారిటీ సాయంతో వీరి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో హరిత, ఆమె భర్త, కుమారుడితో కలిసి షార్జాకు ప్రయాణమయ్యారు. మామూలుగా అయితే ఈ విమానంలో 180 మంది ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే కోవిడ్ ప్రోటోకాల్ కారణంగా కొందరు ప్రయాణికులను విమానంలో ఎక్కడానికి సంస్థ అనుమతించలేదు. ఇక మరికొందరు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే వీరు ముగ్గురే విమానంలో ప్రయాణించారు.