River Management Board: గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండా… తెలంగాణ సర్కార్ లేఖలు.. పరిగణనలోకి తీసుకోని బోర్డులు
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గత నెల 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా సోమవారం సంయుక్తంగా సమావేశం నిర్వహించేందుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి.
బోర్డు పరిధిలో కొన్ని అంశాలపై అభ్యంతరాలను ప్రస్తావించడంతోపాటు ఏపీకి న్యాయబద్ధంగా దక్కాల్సిన నీటి కోటా కోసం బోర్డుల సమావేశంలో బలమైన వాదనలు వినిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశానికి హాజరు కాలేమని తెలంగాణ సర్కార్ తొలుత లేఖ పంపగా.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన 30 రోజుల్లోగా బోర్డుల స్వరూపాన్ని ఖరారు చేయాలని, సమయం తక్కువగా ఉన్నందున తప్పనిసరిగా హాజరు కావాలని బోర్డులు తేల్చి చెప్పాయి. సోమవారం ఎన్జీటీలో కేసుల విచారణకు హాజరు కావాల్సి ఉన్నందున సమావేశాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని రెండు బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం మరోసారి వేర్వేరుగా లేఖలు రాసింది. అయితే దీన్ని పరిగణనలోకి తీసుకోని బోర్డులు సోమవారం సమావేశాన్ని యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాయి.
ఈ నెల 3న జరిగిన బోర్డుల సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరుకాలేదు. అయినప్పటికీ ఆ సమావేశాన్ని బోర్డులు యథాతథంగా నిర్వహించాయి. పూర్తి స్థాయి బోర్డుల సమావేశాన్ని నిర్వహించిన తర్వాతే సమన్వయ కమిటీల భేటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సర్కార్ ఆ భేటీకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని బోర్డుల పరిధిపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. జల్ శక్తి శాఖ స్పందన ఆధారంగా మిగిలిన అంశాలపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ సర్కార్ హాజరు కాకపోవడంతో సమన్వయ కమిటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. దీంతో తెలంగాణ సర్కార్ ప్రతిపాదించిన మేరకు పూర్తి స్థాయి బోర్డుల సమావేశాన్ని నిర్వహించాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్‌లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్‌లు నిర్ణయించారు. ఆ మేరకు సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కానీ దీనికి సైతం హాజరుకాలేమని తెలంగాణ ప్రభుత్వం చెప్పంది. అయినప్పటికీ 15న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలే అజెండాగా సంయుక్తంగా సమావేశం నిర్వహించేందుకు రెండు బోర్డులు సిద్ధమయ్యాయి.
వివాదం మొదలైందిలా...
కృష్ణా నదీ జలాలపై తెలంగాణ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇటీవల సుప్రీంకోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరిస్తోందని.. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొంది. ఏపీకి రావాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని ఆరోపించింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది.