TPCC Chief News: టీపీసీసీ చీఫ్ ఎంపిక తాత్కాలికంగా వాయిదా, కారణం ఏంటంటే?
Telangana PCC Chief: టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం వివిధ నేతల పేర్లను పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.
Telangana News: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎన్నిక గురించి గత కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి బీసీ నేతను ఎంపిక చేయబోతున్నారని అందులో భాగంగానే మహేశ్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఫైనల్ అయిందని కూడా ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ, పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియను కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేయనున్నట్లుగా ప్రకటించింది.
తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం కోసం వివిధ నేతల పేర్లను పరిగణనలోకి తీసుకోగా.. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. అందుకే ఆ ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్టు సమాచారం. ఈ విషయంలో వారం రోజుల తర్వాత మరోసారి కదలిక వస్తుందని భావిస్తున్నారు. అప్పుడు మరోసారి టీపీసీసీ చీఫ్ ఎంపిక గురించి చర్చించాలని ఏఐసీసీ పెద్దలు నిర్ణయించారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల పరస్పర అంగీకారం తర్వాతే టీపీసీసీ చీఫ్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ పీసీసీ పదవి కోసం రేసులో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా టీపీసీసీ చీఫ్ పదవిని అడుగుతున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియను వాయిదా వేసినట్లు చెబుతున్నారు.