Liquor Shops: కొత్త మద్యం దుకాణాల షెడ్యూల్ విడుదల... స్థానికులకే లిక్కర్ షాపులు... మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
మద్యం దుకాణాలను స్థానికులకే కేటాయిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపునకు రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు.
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. రాష్ట్రంలో మంగళవారం నుంచి కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించిందని తెలిపారు. గౌడ కులస్థులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు మద్యం దుకాణాలను(Wine Shops) లాటరీ ద్వారా కేటాయించినట్లు మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడలకు 15 శాతం(363), ఎస్సీలకు 10 శాతం (262), ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించామన్నారు. వందశాతం లాభాలతో నడిచే వ్యాపారమైన మద్యం దుకాణాలను స్థానికులకే కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అన్ని విధాలుగా స్థానికులకు లాభాలు చేకూరే విధంగా నూతన మద్యం పాలసీని రూపొందించినట్టు వివరించారు.
గౌడ, ఎస్సి, ఎస్టీలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ’లకు 15% (363), ఎస్సి’లకు 10% (262), ఎస్టి’కులస్తులకు 5% (131) రిజర్వేషన్ ప్రకారం మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించడం జరిగింది. 1864 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగింది. pic.twitter.com/rbRR7fozH2
— V Srinivas Goud (@VSrinivasGoud) November 9, 2021
రిజర్వేషన్ల కింద 756 మద్యం దుకాణాలు
హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు రిజర్వేషన్ ప్రకారం 756 మద్యం దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు. 1864 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉన్నాయన్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో మద్యం షాపులకు రిజర్వేషన్లు(Reservations) అమలు చేస్తున్నామన్నారు.
Also Read: మందుబాబులకు గుడ్ న్యూస్... తెలంగాణలో కొత్తగా 404 లిక్కర్ షాపులు... ఒకే పేరుతో ఎన్ని దరఖాస్తులైనా
ఒక బ్యాంకు గ్యారెంటీ చాలు
అంతకు ముందు నీరా పథకం తీసుకువచ్చి గౌడ్ లకు అవకాశం కల్పించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మద్యం దుకాణాలను రిజర్వేషన్ల ప్రకారం లాటరీ ద్వారా కేటాయించామన్నారు. ఈసారి షాపు యజమానులకు వెసులుబాటు కల్పించామని, గతంలో రెండు బ్యాంకుల గ్యారెంటీలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పుడు ఒకటే గ్యారెంటీ తీసుకుంటున్నామన్నారు. దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు గత సంవత్సరం మాదిరిగానే అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో(AP, Karnataka) పోలిస్తే మద్యం దుకాణాలు కూడా నామమాత్రంగా పెంచామన్నారు. ప్రివెలన్స్ ఫీజు కూడా ఏడింతల నుంచి పదింతలు చేశామని, లైసెన్స్ ఫీజు స్లాబులను 8 నుంచి 12కి పెంచామని మంత్రి తెలిపారు.
కల్తీ మద్యాన్ని నియంత్రిస్తాం
గతంలో ఒకరు ఒక్క దుకాణానికి మాత్రమే దరఖాస్తు చేసుకునే పరిమితిని ఇప్పుడు తొలగించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో గుడుంబాను ఉక్కుపాదంతో అణచివేశామన్నారు. అదేవిధంగా గంజాయిని(Ganja) కూడా అరికడతామని, అందుక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. గంజాయి పండించడం, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యాన్ని వందశాతం నియంత్రిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Also Read: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?