Telangana Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్... తెలంగాణలో కొత్తగా 404 లిక్కర్ షాపులు... ఒకే పేరుతో ఎన్ని దరఖాస్తులైనా
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేసిన ప్రభుత్వం...కొత్తగా 404 దుకాణాలకు అనుమతి ఇచ్చింది.
మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి తెలంగాణలో నూతన మద్యం విధానం(New Liquor Policy) అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో వీటి సంఖ్య 2,620కి పెరిగింది. ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయిందని ప్రభుత్వం తెలిపింది. మద్యం దుకాణాల్లో గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కేటాయించినట్లు ప్రకటించింది. ఓపెన్ కేటగిరీ కింద 1,864 మద్యం దుకాణాలు మిగిలి ఉన్నట్లు పేర్కొంది. కొత్త మద్యం దుకాణాలకు రేపటి(మంగళవారం) నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. 20న డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు
తెలంగాణలో కొత్తగా 404 మద్యం దుకాణాలు పెంచుతూ ఆబ్కారీ శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య 2,216 నుంచి 2,620కి పెరిగింది. గత రెండేళ్లల్లో మద్యం అమ్మకాల ఆధారంగా కొత్త దుకాణాలు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల జరిగిన సమీక్షలో చర్చించారు. అమ్మకాలు ఎక్కువ ఉన్నచోట కొత్త దుకాణాలకు అనుమతిచ్చేలా నిర్ణయం తీసకున్నారు. అయితే తెలంగాణ సర్కార్(Telangana Govt) మద్యం దుకాణాలు 2021-2023 సంవత్సరానికి నోటిఫికేషన్(Notification) జారీ చేసింది. దరఖాస్తు ఫీజును రెండు లక్షలుగా నిర్ణయించింది. ఈ సారి మద్యం షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు(Reservations) అమలు చేసింది. ఈ నెల 18 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది.
Also Read: గంటసేపు కేసీఆర్ అబద్ధాలు.. అవన్నీ నిజమని తేల్చు, నేనే ముక్కు నేలకు రాస్తా: బండి సంజయ్
ఒకే పేరుతో ఎన్ని దరఖాస్తులైనా
ఈ నెల 18న వైన్ షాపులకు డ్రా జరగనుంది. రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య పెరగడంతో లిక్కర్ షాపుల(Liquor Shops) ఏర్పాటులో గౌడ్‌లు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది సర్కారు. మరోవైపు మద్యం దుకాణ కేటాయింపులను ఎక్సైజ్ శాఖ సులభతరం చేసింది. ఒక్క మద్యం దుకాణానికి ఒకే పేరుతో ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని ప్రకటించింది. ప్రతి దరఖాస్తుకు రెండు లక్షల మేర ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఒక్కరు ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. కానీ లాటరీలో ఎన్ని వచ్చినా ఒక్క మద్యం దుకాణాన్ని మాత్రమే కేటాయిస్తారు.
Also Read: అది ఫామ్ హౌస్ కాదు.. ఫార్మర్ హౌస్.. సీదా ఒక్కటే అడుగుతానా వడ్లు కొంటరా? కొనరా?