Azharuddin Portfolios: అజారుద్దీన్ హోం శాఖ కోసం పట్టుబట్టారా? రేవంత్ రెడ్డి ఎందుకు నో చెప్పారు? కేటాయించిన శాఖలివే
అజారుద్దీన్‌కు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ (బ్యాట్స్‌మెన్) గా గుర్తింపు ఉంది. ఇప్పుడు రేవంత్ సర్కార్‌లో కూడా కీలక శాఖనే తనకు ఇవ్వాలని మాజీ క్రీడాకారుడు అజారుద్దీన్ పట్టుబట్టినా అది సాధ్యం కాలేదు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి నాలుగు రోజులు అవుతోంది. ఇవాళ అజారుద్ధీన్ కు మైనార్టీ శాఖతో పాటు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను కేటాయించడం జరిగింది. అయితే ఈ నాలుగు రోజల్లో ఏం జరిగింది. శాఖ కేటాయంపులో జాప్యానికి కారణాలేంటి. అజారుద్ధీన్ ఎం కోరుకున్నారు. సీఎం రేవంత్ ఎం చెప్పారు. అజారుద్ధీన్ అడిగిన శాఖనే ఇచ్చారా అన్న అంశాలు ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
1. హోం శాఖనే కావాలని పట్టుబట్టిన అజారుద్దీన్
క్రికెట్ టీంలో అజారుద్దీన్‌కు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ (బ్యాట్స్‌మెన్) గా గుర్తింపు ఉంది. ఇప్పుడు రేవంత్ సర్కార్‌లో కూడా కీలక శాఖనే తనకు ఇవ్వాలని మాజీ క్రీడాకారుడు అజారుద్దీన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా హోం శాఖను మైనార్టీ వ్యక్తి అయిన మహమూద్ అలీకి మాజీ సీఎం కేసీఆర్ కట్టబెట్టారు. అదే తరహాలో కీలక హోం శాఖ తనకు ఇవ్వాలని అజారుద్దీన్ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు సంకేతాలు పంపినట్లు అవుతుందన్నది అజార్ వాదన.అయితే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు, క్రీడా శాఖను ఇవ్వాలని, అవసరం అయితే మరో శాఖను ఇచ్చేందుకు సిద్ధమని అజార్‌కు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం సామాజిక సమీకరణాల వల్ల కీలకమైన హోం శాఖను కేటాయించడం కుదరదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తనకు హోం శాఖనే ఇవ్వాలని అజారుద్దీన్ పట్టుబట్టారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. హోం శాఖ ఇవ్వడం కష్టమని, అందుకు చాలా సమీకరణాలు అడ్డు వస్తున్నాయని ఏఐసీసీ ముఖ్య నేతల ద్వారా కూడా అజార్‌కు రేవంత్ రెడ్డి నచ్చచెప్పించినట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ కారణంగానే అజారుద్దీన్‌కు మైనార్టీ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను కేటాయించారు
2. పార్టీ సమీకరణలు, సీనియర్ నేతల్లో అసంతృప్తి వల్ల అజార్ కు దక్కని హోం శాఖ
గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం పట్ల పార్టీలోని సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నేపథ్యం (నేపధ్యంలో) లో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని నచ్చచెబుతున్నా, తమ సేవలకు గుర్తింపు ఇవ్వరా అని సదరు సీనియర్లు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో హోం శాఖ వంటి కీలక శాఖను అజార్‌కు కట్టబెడితే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుందేమో అన్న ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం మంత్రి వాకిటి శ్రీహరి నిర్వహిస్తున్న క్రీడా శాఖను, మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నిర్వహిస్తోన్న మైనార్టీ సంక్షేమ శాఖను వారి నుండి తీసి అజారుద్దీన్‌కు ఇవ్వాలని, వారిద్దరికీ ఇతర శాఖలను కేటాయించాల్సిన అవసరం ఉందని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ వద్ద హోం శాఖ, విద్యా, మున్సిపల్, వాణిజ్య పన్నులు వంటి కీలక శాఖలు ఉన్నాయి. మంత్రుల మధ్య శాఖల మార్పు వంటి అంతర్గత సమీకరణాల దృష్ట్యా అజార్‌కు తాను కోరిన హోం శాఖ బదులు మైనార్టీ శాఖతో పాటు తన వద్దే ఉన్న పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను సీఎం కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
3. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైనార్టీ ఓటర్ల ఆకర్షణే ముఖ్య లక్ష్యంగా మైనార్టీ శాఖ కేటాయింపు
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవిని కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది. మైనార్టీ ఓటర్లను ప్రభావితం చేయడం ద్వారా ఉపఎన్నికల్లో తమకు లబ్ధి కలుగుతుందన్నది హస్తం నేతల వ్యూహం. అయితే, అజారుద్దీన్‌కు కేటాయించే శాఖల ద్వారా మైనార్టీ ఓట్లను కొల్లగొట్టాలన్న ఆలోచనలో ఆ పార్టీ ఉంది. అయితే, అజారుద్దీన్ హోం శాఖ కోసం పట్టుబట్టడం, ఇందుకు విముఖంగా రేవంత్ రెడ్డి ఉండటం వంటి కారణాల వల్ల శాఖ కేటాయింపులో కొంత జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో అజార్‌కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గంపగుత్తగా మైనార్టీ ఓట్లు పొందడమే తమ లక్ష్యం అని, శాఖ కేటాయింపు వల్ల ఏదైనా బూమరాంగ్ (బూమ్ రాంగ్) అవుతే అది రివర్స్ స్వింగ్ అయి తామే క్లీన్ బౌల్డ్ కావాల్సి వస్తుందని హస్తం నేతలు విశ్లేషిస్తున్నారు. ఈ ఉపఎన్నిక వ్యూహంలో భాగంగానే మంత్రి అజారుద్దీన్‌కు మైనార్టీ శాఖ తోపాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖను కేటాయించినట్లు చెబుతున్నారు.
4. సీఎం అభీష్టం మేరకే అజార్ కు శాఖల కేటాయింపు
హోం శాఖ కావాలని పట్టుబట్టడం, పార్టీలో సీనియర్ల అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు, ప్రస్తుత మంత్రుల శాఖల పునఃకేటాయింపు వంటి కారణాల వల్లనే అజారుద్దీన్‌కు హోం శాఖను కేటాయించలేని పరిస్థితి తలెత్తింది. మైనారిటీ వర్గానికి మంత్రి పదవి దక్కినప్పటికీ, నాలుగు రోజులైనా శాఖ కేటాయించలేదని ప్రతిపక్షాలు విమర్శలు చేసే అవకాశం ఉన్నందున అజారుద్ధీన్ కు మైనార్టీ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెశ్ శాఖలనును కేటాయించడం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి తాను కోరుకున్నట్లు మంత్రి అజారుద్దీన్‌కు హోం శాఖ కాకుండా ఇతర శాఖలను కేటాయించడం జరిగినట్లు అర్థం అవుతోంది.






















