Telangana Local Body Polls: స్థానిక ఎన్నికలపై ఈసీ గైడ్‌లైన్స్.. ఎవరు అర్హులు, అభ్యర్థుల ఖర్చు, డిపాజిట్ సహా పూర్తి వివరాలు
Local Body Polls In Telangana | తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లూ అర్హులేనని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ గైడ్‌లైన్స్ జారీ చేసింది.

Telangana Local Body Elections Candidates Eligibility | హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 5 దశల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 3 దశల్లో సర్పంచ్, వార్డు ఎన్నికలకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుముదిని షెడ్యూల్ విడుదల చేశారు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. త్వరలో ఎన్నికలు జరగనున్నందున అభ్యర్థుల అర్హతలు, నామినేషన్, డిపాజిట్ నగదు, వ్యయం పరిమితులపై తెలంగాణ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీ చేసింది.
రేషన్ డీలర్లు కూడా పోటీ చేయవచ్చు
స్థానిక సంస్థల ఎన్నికల్లో రేషన్ డీలర్లు పోటీ చేయడానికి అవకాశం ఉంది. అయితే నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 ఏళ్లు నిండిన వారిని అర్హులుగా పరిగణిస్తారు. గ్రామ సేవకులు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం పోటీ చేయవచ్చు. పోటీ చేసే గ్రామం, స్థానిక నియోజకవర్గంలో అభ్యర్థి ఓటు హక్కు కలిగి ఉండాలి.
పోటీ చేసేందుకు వీరు అనర్హులు
మతసంబంధమైన సంస్థల చైర్మన్లతో పాటు సభ్యులకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. సింగరేణి, ఆర్టీసీలో మేనేజింగ్ ఏజెంట్, మేనేజర్ లేదా సెక్రటరీ హోదాలో పనిచేసే వారు మినహా ఇతర ఉద్యోగులు పోటీకి అర్హులు. క్రిమినల్ కోర్టులో కొన్ని నేరాలకు శిక్ష పడిన వారు, శిక్ష విధించిన తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు ఎన్నికకు అనర్హులవుతారు. పౌర హక్కుల పరిరక్షణ చట్టం-1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు పోటీ చేసేందుకు అనర్హులు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా (కాంట్రాక్టర్లు) స్థానిక ఎన్నికల్లో అనర్హులు అవుతారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చు పరిమితి ఎంత..
స్థానిక సంస్థల అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. జడ్పీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థి గరిష్టంగా రూ.1.5 లక్షలు ఖర్చు చేయవచ్చు. ఇక 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షల వరకు, 5 వేల కంటే తక్కువ జనాభా ఉంటే రూ.1.5 లక్షల వరకే ఖర్చు చేయాలని ఈసీ పేర్కొంది. అలాగే 5000 కంటే జనాభా ఎక్కువ ఉన్న పంచాయతీలో వార్డు సభ్యుడు రూ.50 వేలు, 5 వేల కంటే తక్కువ జనాభా ఉంటే గరిష్టంగా రూ.30 వేలు ఖర్చు చేయవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి. దాంతో పాటు ఎన్నికల ఖర్చుల వివరాలు ఇవ్వాలి.
అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు తమ అర్హతలు, క్రిమినల్ చరిత్ర, ఆస్తులతో పాటు అప్పులు, చదువు వివరాలపై సెల్ఫ్ డిక్లరేషన్ అఫిడవిట్ దాఖలు చేయాలి. ఒక్క వివరాలు లేకపోయినా నామినేషన్ రిజెక్ట్ అవుతుంద. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.
అభ్యర్థులు ఎంత డిపాజిట్ చేయాలి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోటీచేసే కేటగిరీని బట్టి డిపాజిట్ చేయాలి. జడ్పీటీసీ అభ్యర్థి (జనరల్) అయితే రూ.5 వేలు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు అయితే రూ. 2,500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీ అభ్యర్థులు రూ.2,500 (జనరల్).. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250.. సర్పంచ్ అభ్యర్థి జనరల్ అయితే రూ.2 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000.. వార్డు సభ్యుడు జనరల్ అయితే రూ.500.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు యితే రూ.250 డపాజిట్ చేయాలి. అభ్యర్థులు పంచాయతీల పన్ను బకాయిలతో పాటు కరెంట్ బిల్లులు చెల్లించి రసీదులు తీసుకోవాలి. ముఖ్యంగా అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికెట్స్ (Caste Certificate) తీసుకుని ఉండాలి.






















