KTR Fires on RTC Charges Hike: కాంగ్రెస్‌ను ఓడించారనే కక్షతో హైదరాబాద్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంపు, పండుగ పూట దుర్మార్గం: కేటీఆర్
RTC Fares Hike in Hyderabad | సిటీ బస్సు చార్జీలను ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూడటం దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు.

RTC Charges in Hyderabad | హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సిటీ బస్సు కనీస ఛార్జీని ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.10 పెంచాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. పండుగ సమయంలో తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయంగా అభివర్ణించారు. పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పన్నిన కుట్ర అని కేటీఆర్ విమర్శించారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో తెలంగాణ ప్రజలు అల్లాడుతున్న సమయంలో బస్సు ఛార్జీల పెంపు వారి నెత్తిన పిడుగులాంటిదని కేటీఆర్ అన్నారు. ప్రతి నిత్య ప్రయాణికుడిపై నెలకు కనీసం రూ.500 అదనపు భారం పడుతుందని.. బడుగుజీవులు, దినసరి కూలీలు ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ఎలా బతకాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు, టీ24 టిక్కెట్ ఛార్జీలు (Day Ticket)ను పెంచింది చాలదన్నట్టు, రెగ్యూలర్ ఛార్జీపై ఏమాత్రం కనికరం లేకుండా 50 శాతం ధరలను పెంచడం సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ, అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం అని కేటీఆర్ మండిపడ్డారు.
రాజధాని హైదరాబాద్ వాసుల నడ్డివిరిచేలా ప్రతి నిత్యం దాదాపు కోటి రూపాయల భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తున్న రేవంత్రెడ్డి జంట నగరాల ప్రజలపై కక్ష పెంచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జంటనగరాల్లో కాంగ్రెస్ ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారనే కసితోనే రేవంత్ రెడ్డి ప్రతీకార చర్యలకు దిగుతున్నారని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సిటీ బస్సు చార్జీలను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 10 రూపాయలు పెంచి జంట నగరంలోని పేద మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు దుర్మార్గమైనవి.
— KTR (@KTRBRS) October 5, 2025
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో.. ప్రతి ప్రయాణికుడిపై నెలకు 500 రూపాయల… pic.twitter.com/Wt39QnSCfH
ఉచిత బస్సు పథకంతో రాష్ట్ర ఆర్టీసీ సంస్థను దివాళా తీయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూస్తోందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వలన రాష్ట్ర ప్రగతి రథచక్రాలే కాదు, చివరికి ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు సైతం ధ్వంసం చేసిన పాపం సీఎం రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ సర్కారును కుప్పకూల్చే వరకూ వెంటాడుతుందని హెచ్చరించారు.






















