TRS Mlas Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తునకు లైన్ క్లియర్, స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు
TRS Mlas Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తుపై స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
TRS Mlas Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు దర్యాప్తుపై విధించిన స్టే ఎత్తివేసింది. మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఫామ్ హౌస్ కేసులో బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హై కోర్టు సింగిల్ బెంచ్ కేసు దర్యాప్తుపై గతంలో స్టే విధించింది. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని బీజేపీ నేత కోర్టును కోరారు. మంగళవారం జరిగిన విచారణలో గతంలో ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో దర్యాప్తు వేగవంతం చేసేందుకు పోలీసులకు మార్గం సుగుమం అయింది.
ఈ నెల 18కి విచారణ వాయిదా
ఫామ్ హౌస్ కేసును సీబీఐ, లేదా ఇతర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీ వేసిన పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు విచారణ పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ముగ్గురు నిందితులను పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉంది.
అసలేం జరిగింది?
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఇటీవల తెలంగాణలో సంచలం సృష్టించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 100 కోట్ల ఇస్తామని రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్ ఆశ చూపారు. ముందు పైలెట్ రోహిత్ రెడ్డి కలిసిన ఈ నేతలు మొయినాబాద్ ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఫామ్ హౌస్ వీడియోలు, ఆడియోలను టీఆర్ఎస్ బయటపెట్టింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబర్ 26వ తేదీన ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 41-ఏ సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదంటూ ఏసీబీ కోర్టు నిందితుల రిమాండ్ ను తిరస్కరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బీజేపీ నేతలు.. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని సీబీఐకి కేసు అప్పగించాంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితులకు బీజేపీ సంబంధంలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో ఈ వ్యవహారం అంతా నడిచిందని ఆరోపిస్తున్నారు.
ఎఫ్ఐఆర్ లో ఇలా
నిందితులు, ఎమ్మెల్యేల మధ్య జరిగిన బేరసారాలను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పూసగుచ్చినట్టు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, నందకిశోర్, సింహయాజీపై కేసు నమోదు చేసినట్టు రాజేంద్రనగర్ ఏసీపీ తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు ప్రస్తావించారు పోలీసులు. బీజేపీలో చేరితో వంద కోట్లు... చేర్చిన వాళ్లకు యాభై కోట్ల పేరుతో ఆఫర్ నడిచించదని పోలీసులు చెబుతున్నారు. బీజేపీలో చేరితే వంద కోట్లు ఇప్పిస్తామని రోహిత్ రెడ్డికి రామచంద్ర భారతి ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు. దీనికి నంద కిశోర్ మధ్యవర్తిత్వం వహించారు. నంద కిశోర్ ఆహ్వానంతోనే రామచంద్రభారతి, సింహయాజీ ఫామ్‌హస్‌కు వచ్చారు. ఫామ్‌హౌస్‌కు వచ్చిన వారు ఎమ్మెల్యేలతో బేరాలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. వచ్చిన మధ్యవర్తులు జరగబోయే పరిణామాలు వివరించారని పేర్కొన్నారు పోలీసులు. బీజేపీలో చేరకపోతే...కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పినట్టు కూడా అందులో తెలిపారు. బీజేపీలో చేరితే కీలక కాంట్రాక్ట్స్‌తోపాటు భారీ మొత్తంలో డబ్బు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామన్నట్టు వివరించారు. ఇదంతా రోహిత్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.