(Source: ECI/ABP News/ABP Majha)
Heroine Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవికి షాక్, పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు
Heroine Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. కశ్మీర్ పండితులు, గోసంరక్షకులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఆమెపై హైదరాబాద్ లో కేసు నమోదు అయింది.
Heroine Sai Pallavi : హీరోయిన్ సాయి పల్లవికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో పాటు గోసంరక్షకులపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. భజరంగ్‌దళ్ నాయకులు ఇటీవల హీరోయిన్ సాయి పల్లవిపై ఫిర్యాదుచేశారు. భజరంగ్‌దళ్ నాయకుల ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సాయిపల్లవికి గత నెల 21న పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ సాయి పల్లవి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాయిపల్లవి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలేమిటీ?
‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల నటి సాయి పల్లవి ఓ ఇంటర్వ్యులో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కశ్మీర్ పండిట్ల మారణ హోమాన్ని ముస్లిం డ్రైవర్‌పై దాడితో పోల్చుతూ ఆమె చేసిన కామెంట్స్‌పై హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలిజం, హింస తదితర అంశాల గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘అందరూ మంచి మనుషుల్లా ఉండాలి. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారు. మనం కూడా అలా చేయకూడదు. బాధితుల గురించి ఆలోచించాలి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు మనం దాన్ని మత సంఘర్షణలా వాటిని చూస్తే.. ఈ మధ్య ఓ ముస్లిం డ్రైవర్ తన బండిలో ఆవుని తీసుకెళ్తుండగా.. కొంతమంది అతడిని కొట్టి, జైశ్రీరామ్ అని చెప్పమన్నారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది..? మనమంతా మంచి మనుషులుగా ఉండాలి. అప్పుడే ఐక్యత ఉంటుంది’’ అని పేర్కొంది.
సుల్తాన్ బజార్ పీఎస్ లో కేసు నమోదు
కశ్మీర్ పండిట్లను చంపిన ఉగ్రవాదులతో గోరక్షకులను పోల్చింది సాయిపల్లవి. కశ్మీర్ లో పండిట్లను చంపడం మతపరమైన హింసే అయితే.. గోరక్షణ పేరుతో జరుగుతోంది కూడా అదేనని చెప్పింది. సాయిపల్లవి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంలో చాలా మంది ఆమెని ట్రోల్ చేశారు. చరిత్ర తెలియకుండా.. ఇలాంటి కామెంట్స్ చేయకంటూ ఆమెపై మండిపడ్డారు. భజరంగ్‌దళ్ సభ్యులు సాయిపల్లవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఆమెపై సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. అలానే సైబర్ క్రైమ్ ని కూడా ఆశ్రయించారు. ఉగ్రవాదులతో, గోరక్షకులను పోల్చడమేంటంటూ సాయిపల్లవిపై ఓ రేంజ్ లో మండిపడ్డారు.