Medical Kits: బీపీ, షుగర్ రోగులకు మెడికల్ కిట్లు! నెలకు సరిపడా మందులు
కేసీఆర్ కిట్ల తరహాలోనే బీపీ, షుగర్, కేన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రత్యేక మెడికల్ కిట్ల్ల పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
బీపీ, షుగర్, కేన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రత్యేక మెడికల్ కిట్ల్ల పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఈ వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తోన్న నేపథ్యంలో బాధితులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వినూత్న ఆలోచన చేస్తోంది. ప్రసవ సమయంలో మహిళలకు అందిస్తోన్న కేసీఆర్ కిట్ల పథకం మాదిరిగానే వీటిని అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కిట్ల పథకానికి అద్భుత స్పందన వస్తోన్న నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం మరో పథకానికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా రూపొందించబోయే కిట్లు ఎలా ఉండాలనే అంశంపై ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ పథకం సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇది ప్రారంభమైతే రాష్ట్రంలోని 25 లక్షల మందికి పైగా బీపీ, షుగర్, కేన్సర్ బాధితులకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
తొలుత పది లక్షల మందికి..
తెలంగాణలో 30 ఏళ్లకు పైబడిన వారికి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కార్యక్రమం పేరిట అన్ని జిల్లాల్లో బీపీ, షుగర్, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో గతేడాది వరకు 25 లక్షల మందికి బీపీ, షుగర్ ఉన్నట్లు గుర్తించారు. వీరికి స్థానికంగా ఉండే పీహెచ్‌సీలు, సబ్ సెంటర్లలో మందులు అందిస్తున్నారు. అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు పెద్ద ఆసుపత్రులకు పంపుతున్నారు. దీనిని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు మెడికల్ కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తొలి దశలో 10 లక్షల కిట్లు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహించి.. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఒకేసారి నెలకు సరిపడా..
అసాంక్రమిక వ్యాధుల (నాన్ కమ్యూనికబుల్ డిసీజ్) కిట్లలో షుగర్, బీపీ, కేన్సర్ తదితర రోగాలకు నెలకు సరిపడా మందులను అందిస్తారు. ఇందులో మందులతో పాటుగా వాటిని ఎలా వాడాలనే వివరాలతో కూడిన సమాచార పత్రాలు కూడా ఉంటాయి. నిరక్షర్యాసులు సైతం తేలికగా అర్థం చేసుకునేట్లు ప్రత్యేకంగా విభాగాలు ఏర్పాటు చేసి మందులను ఉంచుతారు. వృద్ధులకు అనుకూలంగా ఉండేలా వీటిని ఒక బ్యాగు రూపంలో అందిస్తారు. వీటిని కేసీఆర్ కిట్ల మాదిరిగానే ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.