Congress Guarantees: మరో 2 గ్యారెంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం - 39.50 లక్షల మందికి గ్యాస్ రాయితీ
Telangana News: రాష్ట్రంలో మరో రెండు గ్యారెంటీల అమలుకు ముందడుగు పడింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీలో నిర్ణయించారు.
Gas Subsidy: కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్ధమైంది. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి గురువారం నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 39.50 లక్షల మందికి రాయితీ గ్యాస్ అందించనున్నారు. రూ.500 చెల్లించిన వినియోగదారులకు గ్యాస్ అందించాలని.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని డీలర్లకు రేవంత్ సర్కార్ స్పష్టం చేసింది.
రూ.500లకే గ్యాస్
రూ.500కే గ్యాస్ అందించేందుకు రేవంత్ (Revanth Reddy)సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 27 లేదా 29న పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు గ్యాస్ డీలర్లందరూ సిద్ధంగా ఉండాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సివిల్ సప్లయ్స్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంకు అగ్రిగేటర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 1.20 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో రేషన్‌కార్డు(Ration Card) ఉన్నవారి సంఖ్య 89.99 లక్షలు. ప్రాథమిక అంచనా మేరకు ప్రస్తుతం 39.50 లక్షల మందిని సబ్సిడీ గ్యాస్ పథకానికి అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అర్హుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పథకం అమల్లోకి వచ్చిన రోజు నుంచి అర్హులైన వినియోగదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని పౌరసరఫరాలశాఖ డీలర్లకు స్పష్టం చేసింది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించింది.
గ్యాస్ డీలర్లు అంగీకారం
ప్రభుత్వ నిర్ణయాన్ని గ్యాస్ డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. అయితే రాయితీ గ్యాస్ చెల్లింపు వల్ల తాము ఆర్థికంగా కొంత ఇబ్బందపడతామని.. రాయితీ సొమ్ములో కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇస్తే వెసులుబాటు ఉంటుందని కోరారు. డీలర్ల ప్రతిపాదనకు పౌరసరఫరాల శాఖ అంగీకరించింది. ముందుగా కొంత సొమ్ము చెల్లించి మిగిలిన మొత్తం సిలిండర్ల సరఫరా ఆధారంగా చెల్లిస్తామని అధికారులు తెలిపారు.
ఉచిత విద్యుత్
రాయితీ గ్యాస్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకానికి సైతం అదేరోజు ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే ఇంటింటి సర్వే పూర్తి చేసిన ఇంధనశాఖ సిబ్బంది..అర్హుల వివరాలను ప్రభుత్వానికి అందించింది. వచ్చే నెల నుంచే ఈ పథకం అందుబాటులోకి రానుంది. మార్చి నెల బిల్లు జీరో బిల్లులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ మేరకు విద్యుత్ శాఖ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పథకాలకు తొలుత అర్హులకు అందించే ఆ తర్వాత మిగిలిన వారు దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తప్పులను సవరించుకునేందుకు అవకాశం కల్పించింది.ప్రాథమికంగా గృహజ్యోతి పథకం, రాయితీ గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారులకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ముందుగా రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అమలు చేయనున్నారు.