Minister KTR: 'కేసీఆర్ ను ఓడించేందుకు దండుపాళ్యం బ్యాచ్' - పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్న కేటీఆర్
Telangana Elections 2023: కాంగ్రెస్, బీజేపీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు. పని చేసే, అభివృద్ధి కోసం కాంక్షించే వారికే ఓటెయ్యాలన్నారు.
KTR Slams Congress and BJP: ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఆలోచించి, విచక్షణతో ఓటెయ్యాలని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రంగారెడ్డి (Rangareddy), వికారాబాద్ (Vikarabad)ల్లోని రోడ్ షోల్లో ప్రసంగించారు. పని చేసే ప్రభుత్వాన్ని, నాయకున్ని ప్రోత్సహించడం ప్రజల బాధ్యత అని చెప్పారు. సీఎం కేసీఆర్ ను ప్రజలు రెండుసార్లు ఆశీర్వదిస్తే అభివృద్ధి, సంక్షేమం ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ (Congress), బీజేపీలు ఆగమాగం చేస్తారని వారి మాటలు నమ్మొద్దని సూచించారు. కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. హస్తం పార్టీకి ఇప్పటికే అనేక సార్లు ఛాన్స్ ఇచ్చారని, మళ్లీ ఇప్పుడొచ్చి మరో ఛాన్స్ ఇచ్చారని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ను ఓడించేందుకు దండుపాళ్యం బ్యాచ్ బయలుదేరిందని, అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. చేవెళ్లకు ఇచ్చిన మాట ప్రకారం 111 జీవోను ఎత్తేశామని, అందులోని న్యాయపరమైన చిక్కులను పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
'ఆ ఘనత కేసీఆర్ దే'
సీఎం కేసీఆర్ అన్ని రంగాలను అభివృద్ధి చేసేలా పాలన సాగిస్తున్నారని, అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన నేత అని కేటీఆర్ కొనియాడారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ ఇలా ఏ పండుగ వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం కానుకలు అందజేసిందని, భాగ్యనగరాన్ని ప్రశాంత నగరంగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. 'బీఆర్ఎస్ పాలనలో విద్యుత్, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి కరెంట్ సరఫరాపై అనుమానం ఉంటే తీగలు పట్టుకుని చూడాలి. కరెంట్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదు.' అని కేటీఆర్ పేర్కొన్నారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కరోనా వల్ల, కాంగ్రెస్ నేతల కేసుల వల్లే జాప్యం అవుతోందని స్పష్టం చేశారు.
'డిసెంబర్ తర్వాత కొత్త పథకాలు'
డిసెంబర్ తర్వాత 4 కొత్త పథకాలు వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి ఆడబిడ్డకు రూ.3 వేల సాయం అందిస్తామని, తెల్ల రేషనా కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక కేసీఆర్ అని ఆయన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు పన్నుతున్నాయని, అలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ దండుపాళ్యం బ్యాచ్ ను తరిమికొట్టాలని, కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు ఇప్పుడు బాధ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ తప్పు తెలంగాణలో పునరావృతం కాకూడదని, డిసెంబర్ 3న కేసీఆర్ ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందామని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.