Telangana Election Contestant List 2023: ఎన్నికల బరిలో నిలిచింది వీరే - ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన ఈసీ
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది నిలిచినట్లు ఈసీ ప్రకటించింది. అత్యధికంగా ఎల్బీ నగర్ లో 48 మంది, అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేటల్లో ఏడుగురు పోటీలో ఉన్నారని పేర్కొంది.
Final Contestanta List in Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది అభ్యర్థులు నిలిచినట్లు ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 608 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. అత్యధికంగా ఎల్బీ నగర్ లో 48 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. అత్యల్పంగా బాన్సువాడ, నారాయణపేట నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారని పేర్కొంది. ఇక, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) బరిలో నిలిచిన గజ్వేల్ (Gazwel Constituency) నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సీఎం పోటీ చేస్తోన్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో (Kamareddy) 39 మంది అభ్యర్థులు తుది పోరులో ఉన్నారు. మునుగోడులో 39 మంది, పాలేరు 37, కోదాడ 34, నాంపల్లి 34, ఖమ్మం 32, నల్గొండ 31, కొత్తగూడెం 30, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 10 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధానమైన నామినేషన్ల ఘట్టం పూర్తి కాగా అధికార బీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం జోరు పెంచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ తమ మేనిఫెస్టోను వివరిస్తున్నారు. అటు బీజేపీ సైతం బీసీలకు తాము ఇచ్చిన ప్రాధాన్యత వివరిస్తూ ప్రచారం జోరు పెంచింది.
30న పోలింగ్
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, 28తో ప్రచార పర్వం ముగియనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పటిష్ట చర్యలు చేపడుతున్నారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసులు సమన్వయంతో ఎన్నికల భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.