Telangana Elections 2023 : బీఆర్ఎస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత - తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది - చిదంబరం కీలక వ్యాఖ్యలు
Telangana Elections Chidambaram : తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని చిదంబరం అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.
Telangana Elections 2023 : నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో విఫలం అయిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు కోపంతో ఉన్నారని ఈ కోపాన్ని నవంబర్ 30న ఓటు రూపంలో చూపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిందబంరం పిలుపునిచ్చారు. గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అర్బన్ నిరుద్యోగం దేశంలో కన్నా ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. దీంతో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందని స్పష్టం చేశారు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువగా ఉందని చిదంబరం తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు పర్చలేదని చిదంబరం విమర్శించారు. నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమయిందన్నారు. తెలంగాణ పర్భుత్వం అప్పు 3.66 లక్షల కోట్లకు చేరుకుందని చిదంబరం తెలిపారు. ప్రతి తెలంగాణ పౌరుడిపై అప్పు లక్షకు చేరుకుందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణ నిరుద్యోగ రేటు పురుషుల్లో 7.8 ( , మహిళల్లో 9.5 గా ఉంది. గ్రామీణ నిరుద్యోగ రేటు జాతీయ సగటు కన్నా అధికం. రాష్ట్రంలో 15.1 శాతంగా ఉంది. 1.91 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయలేదు. టీఎస్‌పీఎస్సీలో 22 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ అయ్యారు. వారికి నిరుద్యోగ భృతి చెల్లించడంలో సర్కార్ ఫెయిల్ అయింది. ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర అప్పులు 3.66 లక్షల కోట్లకు పెరిగింది. ఏటేటా అప్పులు భారీగా పెరిగాయి. ఫలితంగా ఒక్కొక్కరిపై 96 వేల రూపాయల అప్పు భారం పడింది. దీంతో సంక్షేమ పథకాల అమలు కష్టంగా మారిందని చిదంబరం విశ్లేషించారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చెప్పారు. కాంగ్రస్ ఎందుకోసం అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటనను చిదంబరమే అప్పట్లో చేశారు.