Telangana Elections 2023 : సీవిజిల్ యాప్ ఉంటే మరే విజిల్ బ్లోయర్ - ఈసీకి ఇట్టే ఫిర్యాదు చేయవచ్చు !
ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సీ విజిల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఈసీకి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
![Telangana Elections 2023 : సీవిజిల్ యాప్ ఉంటే మరే విజిల్ బ్లోయర్ - ఈసీకి ఇట్టే ఫిర్యాదు చేయవచ్చు ! Telangana Elections 2023 : C Whistle app has been made available for complaints about irregularities in elections. Telangana Elections 2023 : సీవిజిల్ యాప్ ఉంటే మరే విజిల్ బ్లోయర్ - ఈసీకి ఇట్టే ఫిర్యాదు చేయవచ్చు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/02/fec88551acfa6951240963033e6385631698918496312228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana Elections 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు, ఆయా రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేయడంతో పాటు మద్యం, డబ్బు పంపిణీపై నిఘా పెట్టేందుకు ఎలక్షన్ కమిషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఈ యాప్‌ను ఉపయోగించింది. అప్పట్లో ఈ యాప్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీ-విజిల్ యాప్‌ను వినియోగిస్తున్నారు.
ప్రలోభాలపై పౌరులు సులువుగా ఫిర్యాదు చేయవచ్చు !
ఎక్కడైతే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా మద్యం, డబ్బు, ఇతర సామాగ్రి పంపిణీ చేస్తూ.. ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తారో దానికి సంబంధించిన ఫొటో, ఆడియో, వీడియో గానీ తీసి.. దాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫోటోలు, ఆడియో, వీడియోల ఆధారంగా నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారెవరైనా ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. మీ పేరు, జిల్లా, పిన్‌కోడ్ వంటి వివరాలు ఎంటర్ చేయమంటుంది. అనంతరం ఫొటో, ఆడియో, వీడియో మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి. లైవ్ లొకేషన్ ఆన్ చేసి అక్కడి పరిస్థితుల ఆధారంగా ఆప్షన్ ఎంపిక చేసుకుని ప్రొసీడ్ కొడితే నేరుగా సంబంధిత అధికారులకు విషయం చేరిపోతుంది. సీ-విజిల్ ద్వారా చేసే ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచుతారు.
ఫిర్యాదు దారు వివరాలు గోప్యం
అప్‌లోడ్ చేసిన ఫిర్యాదులను ఎలక్షన్ కమిషన్ వెంటనే పరిశీలిస్తుంది. వంద నిమిషాల్లోనే చర్యలకు ఉపక్రమిస్తుంది. సీ-విజిల్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లను ఈసీ రహస్యంగా ఉంచు తుంది. అంతేగాక బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశాన్ని కూడా ఫిర్యాదుదారులకు చేరవేస్తారు. కాబట్టి ఎన్నికలు సజావుగా పారదర్శకంగా జరగాలంటే ప్రజలు తమ కండ్ల ముందు కనిపిస్తున్న అన్యాయాన్ని వెంటనే జీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదుచేయాలి. ఇది సురక్షితమై నదని, దీనిని ఆపరేటింగ్ చేయడం సైతం చాలా సులువైనదని అధికారులు చెబుతున్నారు. ఇంగ్లీష్‌లో కానీ తెలుగులో కానీ సమస్యను పంపించవచ్చు.
వికలాంగుల కోసం.. సాక్ష్యం యాప్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వికలాంగుల కోసం సాక్ష్యం అనే ఒక యాప్ తయారు చేశారు. ఈ యాప్ ద్వారా వివిధ రకాలైన సేవలు పొందుటకు అవకాశం కల్పించారు. ఈ యాప్ ద్వారా వికలాంగులకు కొత్త ఓటర్ నమోదు, ఓటర్ బదిలీ, తప్పుల సవరణ, తీసివేత, ఆధార్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. అలాగే వీల్ చైర్ కోసం అభ్యర్థన పెట్టుకోవచ్చు. వికలాంగులను ఓటర్ కేంద్రం వరకు తీసుకెళ్లి.. తిరిగి పంపుటకు అభ్యర్థనతో పాటు సహాయకులకు అభ్యర్థన చేసుకునే వీలుంది. ఎలక్ట్రోల్ రోల్ నందు పేరుని గుర్తించడం, పోలింగ్ కేంద్రం ఎక్కడ అనేది తెలుసుకోవడం మొదలైన సేవలు ఈ యాప్ ద్వారా అందిస్తారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)