Telangana News: ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు - వచ్చేనెల మూడు నుంచి రాష్ట్రంలో ఈసీ పర్యటన
Telangana News: తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే వచ్చే నెల మూడో తేదీ నుంచి ఈసీ పర్యటన కొనసాగనుంది.
Telangana News: తెలంగాణలో మరికొన్ని నెలల్లో శాసన సభ ఎన్నికలు రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు వేగంగా సన్నాహాలు సాగుతున్నాయి. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం.. ఇప్పటికే రాష్ట్ర అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈక్రమంలోనే ఏర్పాట్లను సమీక్షించేందుకు వచ్చే నెల మూడో తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో.. కమిషనర్ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ఆయా రాష్ట్రాల్లో ఏర్పాట్లను సమీక్షించనున్నారు. ఇందులో భాగంగానే సీఈసీ.. తెలంగాణలో తాత్కాలిక పర్యటన తేదీలను రాష్ట్ర అధికారులకు పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో.. రాష్ట్ర అధికారులు ఓటర్ల జాబితా నుంచి పోలింగ్ కేంద్రాలు, పోలీసు బందోబస్తు, బోగస్ ఓటర్ల ఏరివేత, ఎన్నికల నిర్వహమ ఏర్పాట్లు తదితర సమాచారాన్ని రూపొందిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ.. దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే 2012కు ముందు ఏపీ సిరీస్ తో 13 నుంచి 14 అంకెలతో ఉన్న ఓటరు గుర్తింపు కార్డులను అధికారులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఓటరు కార్డు సంఖ్య 10 అంకెలకు తగ్గించింది. రాష్ట్రంలోని 47 లక్షల 22 వేల 763 మంది ఓటర్ల కార్డు నంబర్లు మారాయి. వారికి నూతన ఫొటో ఓటరు కార్డులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని కొత్త కార్డులను పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో కొంతమంది కొత్త ఓటరు కార్డులు పొందారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఈసీ పర్యటన ముగిసిన తర్వాత ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తుంది. సానుకూల పరిస్థితులు ఉన్నాయని ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలపై నిర్ణయం తీసుకుంటుందట.
నిన్నటికి నిన్న అధికారులతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్
నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. హైదరాబాదు నుంచి సోమవారం సంయుక్త ఎన్నికల అధికారులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణల కొరకు అందిన దరఖాస్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సంక్లిప్త సవరణ కార్యక్రమం భాగంగా నూతన ఓటరు నమోదు, జాబితాలో సవరణల కొరకు అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, లింగ నిష్పత్తి వారీగా దరఖాస్తు ఫారాలను పరిశీలించి ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు.