CM Revanth Reddy: హైదరాబాద్‌లో ఉబర్ భారీ విస్తరణ- ఫ్యూచర్ సిటీలో కార్పొరేట్ ఆఫీస్.. మల్టీలెవల్ పార్కింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన!
Uber CEO meet CM Revanth: ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై ఉబర్ ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు.

Uber India Future City: తెలంగాణ రాజధాని హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. దిగ్గజ సంస్థ ఉబర్ తన కార్యకలాపాలను నగరంలో మరింత విస్తరించాలని నిర్ణయించింది. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా అమెరికా వెలుపల ఉబర్ ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లోనే ఉందని, ప్రస్తుతం ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నారని, త్వరలోనే ఈ కేంద్రాన్ని మరింత విస్తరించబోతున్నామని ఖోస్రోషాహి వెల్లడించారు.
ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై ఉబర్ ప్రతినిధులు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ సిటీ ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన హబ్‌గా నిలవబోతోందని సీఎం వివరించారు. ఈ ఫ్యూచర్ సిటీలో ఉబర్ తన కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే 100కు పైగా అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని, ఉబర్ వంటి గ్లోబల్ కంపెనీల రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం ఆకాంక్షించారు.
నగరాల్లో నానాటికీ పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మరియు మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఉబర్ సంస్థకు సూచించారు. ఈ పార్కింగ్ కేంద్రాల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తే భవిష్యత్తు అవసరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ వినూత్న ప్రతిపాదనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని ఉబర్ బృందం హామీ ఇచ్చింది.
HCM Sri A. Revanth Reddy held a meeting with @Uber Technologies, Inc. Chief Executive Officer @dkhos at his residence in Jubilee Hills on Tuesday.
— IPRDepartment (@IPRTelangana) May 13, 2026
During the meeting, Uber CEO Dara Khosrowshahi informed the Chief Minister that the company would continue to work closely… pic.twitter.com/bys5uSMp0q
భవిష్యత్తు రవాణా వ్యవస్థలో సాఫ్ట్‌వేర్ , టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తాయని, అందుకే హైదరాబాద్‌ను టెక్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ భేటీలో ఉబర్ సిబిఓ మధు కన్నన్, ఇండియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, సిటిఓ ప్రవీణ్ నిప్పల్లి నాగ మరియు సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఉబర్ విస్తరణ నిర్ణయంతో నగరంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా, రవాణా రంగంలో అత్యాధునిక మార్పులు వచ్చే అవకాశం ఉంది.
ట్రెండింగ్ వార్తలు

















