CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన - UPSC ఛైర్మన్ తో భేటీ, TSPSC ప్రక్షాళనపై చర్చ
Telangana News: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. TSPSC ప్రక్షాళనపై ఆయనతో చర్చించారు.
![CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన - UPSC ఛైర్మన్ తో భేటీ, TSPSC ప్రక్షాళనపై చర్చ telangana cm revanth reddy meet upsc chairman manoj soni CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన - UPSC ఛైర్మన్ తో భేటీ, TSPSC ప్రక్షాళనపై చర్చ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/05/5b7c0d434017b969a15cb928abb564541704451827650876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Revanth Reddy Meet UPSC Chairman: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రెండో రోజు ఢిల్లీ (Delhi) పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఆయన యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో (Manoj Soni) సమావేశమయ్యారు. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా సీఎస్ శాంతికుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్ పీఎస్సీని, యూపీఎస్సీ తరహాలోనే ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా టీఎస్ పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ ఛైర్మన్ తో చర్చించారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ అవలంబిస్తోన్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదా సహా టీఎస్ పీఎస్సీ (TSPSC) వరుస వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు యూపీఎస్సీ (UPSC) విధానాలపై అధ్యయనం చేస్తోంది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా వివాద రహితంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో యూపీఎస్సీతో పాటు కేరళ వంటి ఇతర పబ్లిక్ కమిషన్ల పని తీరుపైనా అధ్యయనం చేసింది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ అధికారులు కేరళలో పర్యటించి ఉద్యోగాల భర్తీ తీరుపై నివేదిక తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్, యూపీఎస్సీ ఛైర్మన్ తో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. సమూల మార్పుల తర్వాతే కమిషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా, టీఎస్ పీఎస్సీపై పలు ఆరోపణల నేపథ్యంలో ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై పెండింగ్ లో పెట్టారు.
కేంద్ర మంత్రులతో భేటీ
యూపీఎస్సీ ఛైర్మన్ తో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్.. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. వేర్వేరు పద్దుల కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.2 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఇరువురూ భేటీ అయ్యారు. తెలంగాణకు ఇది వరకూ మంజూరు చేసిన సైనిక్ స్కూల్ విషయంపై చర్చించారు. అలాగే, రక్షణ భూములు కంటోన్మెంట్ సమస్యలపైనా చర్చించారు. ఏఐసీసీ నిర్వహించిన లోక్ సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాగా, కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని ఈ భేటీలో స్పష్టత ఇచ్చారు. ఆ ప్రాజెక్టుకు మరో రకంగా సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు షెకావత్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)