CM Revanth Reddy: 'నిరుద్యోగులూ వారి మాట విని మోసపోవద్దు' - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Telangana News: తెలంగాణలో సోమవారం నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కచ్చితంగా నిర్వహించి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తరచూ పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని అన్నారు.
CM Revanth Reddy Comments On Group 1 Exams: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై వివాదం రేగుతోన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanthreddy) శనివారం ఈ అంశంపై స్పందించారు. తరచూ పరీక్షలు వాయిదా వేయడం వల్ల విద్యార్థులు నష్టపోతారని.. కొన్ని పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. గతంలో అభ్యర్థులు ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరిగేవారని.. పరీక్షల వాయిదాల వల్ల ఇతర ఉద్యోగాలు సైతం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతాయి. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. కాలయాపనకు ఫుల్ స్టాప్ పెట్టేలా.. గ్రూప్ 1 పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నిబంధనలు మారిస్తే కోర్టులు కొట్టేస్తాయి. జీవో 55 ప్రకారం పోతే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు నష్టం జరిగేది. మెయిన్స్‌లో 1:50కి కూడా రిజర్వేషన్లు పాటిస్తున్నాం. గడిచిన పదేళ్లలో ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రిలిమ్స్ పరీక్ష అయ్యాక విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.' అని రేవంత్ పేర్కొన్నారు.
'ఆందోళనలు విరమించండి'
అభ్యర్థులు ఇప్పటికైనా ఆందోళనలు విరమించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ సూచించారు. గత పదేళ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా కలిశారా.? అని ప్రశ్నించారు. ఎప్పుడైనా ప్రగతి భవన్‌కు పిలిపించుకున్నారా.?. అశోక్ నగర్‌కు ఎప్పుడైనా వచ్చి మాట్లాడారా.? అని నిలదీశారు. 'పరీక్షల నిర్వహణ విధానాన్ని న్యాయస్థానాలు కూడా సమర్థించాయి. మోసగాళ్ల మాటలు విని మోసపోవద్దని నిరుద్యోగులను కోరుతున్నా. పోలీసులు అభ్యర్థులపై లాఠీఛార్జీ చెయ్యొద్దు. కేసులు పెట్టి ఇబ్బంది పెట్టొద్దు. అభ్యర్థుల పట్ల పోలీస్ సిబ్బంది ఉదారంగా వ్యవహరించాలి. కేసులు పెట్టకుండా ఉన్నతాధికారులను ఆదేశిస్తున్నా. రిజర్వేషన్ పకడ్బందీగా అమలు చేయడమే మా లక్ష్యం.' అని సీఎం స్పష్టం చేశారు.
'గ్రూప్ 1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు'
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పరీక్షలు జరుగుతాయని.. నిరసన పేరుతో రోడ్లపైకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
సైబర్ నేరాలపై..
అటు, ప్రజలు, పోలీసులకు సైబర్ నేరాలు పెను సవాల్‌గా మారాయని సీఎం రేవంత్ అన్నారు. సైబర్ నేరాల దర్యాప్తులో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. 'సమాజంలో నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. డ్రగ్స్ మహమ్మారి రాష్ట్రానికి పెను సవాలుగా మారింది. పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా పెరిగింది. జిల్లాల్లోని పోలీసులు గంజాయిని రాష్ట్ర సరిహద్దులోనే అడ్డుకోవాలి.' అని పేర్కొన్నారు. ప్రభుత్వం అంచనాకు తగ్గకుండా.. రాష్ట్ర పోలీసులకు స్ఫూర్తినిచ్చేలా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారని సీఎం కొనియాడారు. ప్రభుత్వ గౌరవం పోలీసులపై ఆధారపడి ఉంటుందని అన్నారు. పోలీస్ అధికారులు తమ విధులను పారదర్శకంగా నిర్వహించినప్పుడే సామాన్యునికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 21న గ్రేహౌండ్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తామన్నారు సీఎం. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి స్కూల్‌లో అడ్మిషన్లు తీసుకోవచ్చని.. డీజీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకూ తమ పిల్లలను చదివించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
Also Read: Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం