Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం
Bandi Sanjay detained by police in Hyderabad | తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వారి కోరిక మేరకు బండి సంజయ్ పోరాటం చేస్తున్నారు.
Telangana Group 1 News | హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను అడ్డుకుని పీఎస్ కు తరలిస్తున్న పోలీసులపై బండి సంజయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థులను కలిసేందుకు బండి సంజయ్ శనివారం ఉదయం అశోక్ నగర్ కు వెళ్లారు. మహిళలని చూడకుండా హాస్టళ్లలో చొరబడి కొట్టారని బండి సంజయ్ కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైటాయించి బండి సంజయ్ నిరసన తెలిపారు. కేంద్ర మంత్రిని అయి ఉండి, నిరుద్యోగుల సమస్య కోసం నిరసనకు దిగానని చెప్పారు. ఈ క్రమంలో ‘చలో సెక్రటేరియట్’కు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
బండి సంజయ్ పిలుపుతో వేలాదిగా గ్రూప్స్ అభ్యర్థులు సెక్రటేరియట్ వైపు కదిలారు. శాంతియుతంగా వెళుతున్న బండి సంజయ్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దోమలగూడ వద్దకు రాగానే పోలీసులు బండి సంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. గ్రూప్స్ అభ్యర్థులు, బండి సంజయ్ పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిని అయిన తాను గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించేందుకు వెళ్తున్నానని, తనకు దారి ఇవ్వాలని కోరారు. మహిళల్ని కొట్టే అధికారం మీకెవరిచ్చారు, ఇలా కేంద్ర మంత్రిని మీ ఇష్టరీతిన అడ్డుకునే హక్కు ఎవరిచ్చారంటూ పోలీసులపై సంజయ్ మండిపడ్డారు. పోలీసులు గో బ్యాక్ అంటూ గ్రూప్స్ అభ్యర్థులు నినాదాలు చేశారు.
పోలీస్ వాహనం దిగి రోడ్డుపై మళ్లీ బైఠాయించిన బండి సంజయ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ పోలీస్ వాహనం దిగి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై మళ్లీ బైఠాయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా జీవో 29పై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ తో కలిసి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్, పార్టీ నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. బండి సంజయ్ కి ఏం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదని, వేలాది మంది నిరుద్యోగులు రక్షణగా నిలిచారు. ‘చలో సెక్రటేరియట్’ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తత నడుమ కొనసాగుతోంది. నిరుద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం చేయాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ పట్టుపట్టారు.
Also Read: Telangana Politics: కాంగ్రెస్ పెద్దలకు బీఆర్ఎస్ డబ్బుల మూటలు - బండి సంజయ్ సంచలన ఆరోపణలు
తెలంగాణలో మూసీ ప్రాజెక్టు, మరోవైపు గ్రూప్ 1 వాయిదా అంశాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పార్టీల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తయినా ఒక్కసారి కూడా గ్రూప్ 1 ఉద్యోగులు భర్తీ చేయలేదు. ఇదివరకే రెండు పర్యాయాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించినా, రద్దు చేశారు. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోవడంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణ మరింత ఆలస్యమైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రిలిమ్స్ నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసినా, అభ్యర్థులు జీవో 29 రద్దు చేయాలని లేకపోతే తమకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. అయితే దశాబ్దం గడిచినా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదేని ఇక ఆలస్యం చేసేది లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఉద్యోగాల భర్తీని ఆపేది లేదని స్పష్టం చేశారు.