Telangana Budget 2022-23 LIVE: అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు RRR సస్పెన్షన్, ఈ సెషన్ పూర్తయ్యేదాకా నో ఎంట్రీ!
Telangana Budget 2022-23 Live Updates: తెలంగాణ బడ్జెట్‌ను సోమవారం (మార్చి 7) ఉదయం 11.30 గంటలకు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు.
LIVE
Background
Telangana Budget LIVE Updates: తెలంగాణ బడ్జెట్ 2022-23ను (Telangana Budget 2022-23) సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao), మండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి గవర్నర్ (Telangana Governor) ప్రసంగం లేకుండానే ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ సమావేశాలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,200 మంది పోలీసులు అసెంబ్లీ సమావేశాల బందోబస్తులో ఉంచారు.
ఆదివారం (మార్చి 6) ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ఆదివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాబడులు, ఆదాయవ్యయాలు, బడ్జెట్ కేటాయింపులు, ఏడాది కాలంలో ప్రభుత్వ ప్రణాళికలను సీఎం కేసీఆర్ మంత్రులకు వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2.31 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఏడాది బడ్జెట్ తో పోలిస్తే 2022-23 రాష్ట్ర బడ్జెట్ కనీసం 10-15 శాతం పెరుగుదల ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దళితుల బంధు కార్యక్రమానికి భారీ కేటాయింపులు చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వరాలు కురిపిస్తోందని సమాచారం.
ఇదే చివరి బడ్జెట్ (TS Budget 2022-23)!
2023 ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ అయినందున సీఎం కేసీఆర్ బడ్జెట్ అమలుపై మంత్రులకు వివరించారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేసిన అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించినట్లు సమాచారం. ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు దీటుగా సమాధానం ఇచ్చేందుకు మంత్రులతో పాటు అధికారులందరినీ పూర్తి సమాచారంతో అసెంబ్లీకి రావాలని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కోరినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాలను ఉపయోగించుకుని రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను బట్టబయలు చేసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
గవర్నర్ తమిళిసై ఆగ్రహం (Governor Tamilisai)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం (Governor Speech) లేకపోవడంపై తమిళిసై స్పందించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లో(Budget Session) గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల కొనసాగింపులో భాగంగానే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వం చెప్పడం సరికాదని గవర్నర్ అన్నారు. ఐదు నెలల తర్వాత సమావేశాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం, గత సమావేశాల కొనసాగింపు అనడం రాజ్యాంగానికి విరుద్ధం అన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించడమే అని తమిళి సై అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు గమనించాలని గవర్నర్ (Governor Tamilisai) కోరారు. రాజకీయాలకు అతీతంగా ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫార్సు చేశామన్నారు. సిఫార్సుకు సమయం తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందని తమిళి సై అన్నారు.
హైదరాబాద్ మెట్రోకు ఆర్థిక సాయం
‘‘ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ.1500 కోట్లు కేటాయించడం జరిగింది.’’ అని హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్‌లో అభివృద్ధి పనులు ఇవీ
‘‘జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల మరమ్మతు పనులు రూ.858 కోట్లతో జరుగుతున్నాయి. ఓఆర్ఆర్ చుట్టూ రూ.387 కోట్ల రూపాయలతో సర్వీసు రోడ్డు నిర్మాణం అవుతోంది. రూ.36.5 కోట్లతో గండిపేట చెరువును మరింత అభివృద్ధి చేస్తున్నాం. రూ.1450 కోట్లతో సుంకిశాల నుంచి క్రిష్ణా జలాలకు హైదరాబాద్‌కు వచ్చే పైపు లైన్ నిర్మాణం జరుగుతోంది. దీనికి ఈ బడ్జెట్‌లో రూ.725 కోట్లు కేటాయిస్తున్నాం. హైదరాబాద్ సీవరేజ్ ట్రీట్‌మెంట్ కోసం రూ.3,866 కోట్లు ఖర్చు చేస్తున్నాం.’’
సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ.3 లక్షలు సాయం
‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ.3 లక్షల సాయం చేస్తాం. నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతుంది. వీటిలో 3.50 లక్షల ఇళ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయి. మిగిలిన 43 వేల ఇళ్లు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వాసితులకు, ప్రమాద బాధితులకు కేటాయించేందుకు వీలుగా సీఎం పరిధిలో ఉంటాయి.’’ అని హరీశ్ రావు తెలిపారు.
ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ నెం.1
‘‘ఇది అంతా కేసీఆర్ మార్కు బడ్జెట్. 2021-22 నాటికి జీఎస్డీపీ రూ.11,54,860 కోట్లుగా ఉంది. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2015-16 నుంచి 2020-21 మధ్య సగటున 11.7 శాతం ఆర్థిక వృద్ధి జరిగింది. ఈ ఆర్థిక వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లోనే తెలంగాణ అగ్రగామిగా ఉంది.’’ అని హరీశ్ రావు అన్నారు.
Telangana Budget: ఆదాయ మార్గాలు (అంచనా)
* పన్ను ఆదాయం - రూ.1,08,212 కోట్లు
* కేంద్ర పన్నుల్లో వాటా - రూ.18,394 కోట్లు
* పన్నేతర ఆదాయం - రూ.25,421 కోట్లు
* గ్రాంట్లు - రూ.41,001 కోట్లు
* రుణాలు - 53,970 కోట్లు
* అమ్మకం పన్ను అంచనా - రూ.33 వేల కోట్లు
* ఎక్సైజ్ ద్వారా ఆదాయం - రూ.17,500 కోట్లు
* స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం - రూ.15,600 కోట్లు