BJP Operation Akarsh : తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, కాషాయ కండువా కప్పుకున్న మంత్రి సోదరుడు
BJP Operation Akarsh : తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచింది బీజేపీ. ఇతర పార్టీల నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తుంది. తాజాగా నలుగురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
BJP Operation Akarsh : బీజేపీలో చేరికలు స్పీడ్ అందుకున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. దిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో తరుణ్ చుగ్, గరికపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు కాషాయం కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రదీప్ రావు మాట్లాడుతూ ... నడ్డా సమక్షంలో బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీని అధికారం తీసుకువచ్చేందుకు కృషిచేస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీకి మంచి మూమెంట్ ఉందన్నారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావుతో పాటు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగనంద్ కొల్లూరు బీజేపీలో చేరారు.
దూకుడు పెంచిన బీజేపీ
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. బండి సంజయ్, ఈటల రాజేందర్ కాంబోలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పీడ్ , ఈటల రాజేందర్ వ్యూహరచనతో బీజేపీలోకి చేరికలు పెరిగాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే లిస్ట్ రెడీ అయిందని ఈటల రాజేందర్ ప్రకటించగా మెల్ల మెల్లగా తమ మనసులోని మాట బయటపెడుతున్నారు నేతలు. ఒకవైపు కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మునుగోడు ఉపఎన్నికతో అధికార టీఆర్ఎస్ కి సవాల్ విసిరారు. అయితే తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉన్నా కరీంనగర్ లో బండి సంజయ్ ను పెద్దఎత్తున ఇతర పార్టీల నాయకులు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
(బొమ్మ శ్రీరాం చక్రవర్తి)
బీజేపీలోకి బొమ్మ శ్రీరాం చక్రవర్తి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కి మరో షాక్ తగిలింది. హుస్నాబాద్ కాంగ్రెస్స్ పార్టీ ఇన్ ఛార్జ్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో శ్రీరాం చక్రవర్తి బీజేపీలో చేరారు. పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరిన అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డికి తిరిగి కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరుస్తూ ఆహ్వానించడంపై నిరసన వ్యక్తం చేసిన శ్రీరాం చక్రవర్తి... నియోజకవర్గంలోని తన సన్నిహితులతో ముందుగా చర్చించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తన అనుచరులతో సహా పెద్ద ఎత్తున బీజేపీలో చేరి కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన గిఫ్ట్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ తన మాటకు విలువ ఇవ్వకపోవడంపై సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం. హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన తనను పక్కకునెట్టి మరీ కీలకమైన సమయంలో పార్టీని వదిలి వెళ్లిన ప్రవీణ్ రెడ్డిని అందలం ఎక్కించడంపై శ్రీరాం చక్రవర్తి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్సీ కూడా
కరీంనగర్ లో మంచి సంబంధాలు ఉన్న నేత మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చినప్పటికీ తనకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న బీజేపీలోకి వెళ్తే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని సమయం కలిసి వస్తే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయవచ్చని ఆయన ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి గతంలో మానకొండూరు ఎమ్మెల్యేగా పనిచేసి, తిరిగి టీఆర్ఎస్ లో చేరిన ఆరెపల్లి మోహన్ సైతం ప్రస్తుత పార్టీలో తనకు టికెట్ వస్తుందనే అంశంపై విశ్వాసం కోల్పోయినట్టు సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఇక ఇదే వరుసలో పెద్దపల్లి కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతగా ఉన్నా ఓదెల జడ్పీటీసీ ఘంటా రాములు ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులను కలిశారని సరైన సమయంలో మరికొంతమంది నేతలు కూడా బీజేపీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎంతవరకు ఫలిస్తుందో వచ్చే ఎన్నికల లోపు తేలనుంది.
Also Read : Munugode Bypolls : మునుగోడులో ప్రచాారానికి అన్న - ఎప్పుడైనా రెడీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి !