TRS On Teenmar Mallana: తీన్మార్ మల్లన్నకు చెంప దెబ్బలు కాదు చెప్పు దెబ్బలు కొట్టాలి... రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం విష సంస్కృతి... బాల్క సుమన్ ఫైర్
బీజేపీ నేత తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాజకీయాల్లోకి కుటుంబాన్ని లాగడం బీజేపీ విషసంస్కృతి అని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ నేత తీన్మార్ మల్లన్న పెట్టిన పోల్ కాకరేపుతోంది. అభివృద్ధి ఎక్కడ జరిగిందంటూ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మంత్రి కేటీఆర్ కుమారుడిని ఉద్దేశిస్తూ యూట్యూబ్ లో క్యూ న్యూస్ పోల్ పెట్టింది. ఈ పోల్ అభ్యంతరకంగా ఉందని టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీన్మార్ మల్లన్న, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి కుటుంబ సభ్యులను లాగడం బీజేపీకి విష సంస్కృతి అని ఆరోపించారు. చింతపండు నవీన్ చర్యలు బీజేపీ ఆటలో ఒక భాగమేనని, బండి సంజయ్ ఏం చెబితే నవీన్ అది చేస్తున్నాడని విమర్శించారు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇదే ఎత్తుగడతో రాజకీయాలు చేసిందని, ప్రస్తుతం తెలంగాణలో అమలుచేస్తోందని విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ తీరును గమనించాలని బాల్క సుమన్ అన్నారు. టీఆర్ఎస్ నేతల సహనానికి ఒక హద్దు ఉంటుందని అన్నారు. తీన్మార్ మల్లన్నకు రెండు చెంప దెబ్బలు కాదు చెప్పు దెబ్బలు కొట్టాలని విమర్శించారు. మహిళలను, కుటుంబ సభ్యులను బీజేపీ కించపరుస్తోందని, ఈ ధోరణి బీజేపీకి మంచిది కాదన్నారు.
Also Read: బూతులు తిడుతూ తీన్మార్ మల్లన్నపై దాడి.. ఏకంగా ఆఫీసులోకి దూసుకొచ్చి దుండగులు రచ్చ రచ్చ.. కేటీఆర్ పనేనని ఆరోపణలు
బీజేపీ విష ప్రచారం
తన ఆస్తులపై కూడా బీజేపీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తుందని బాల్క సుమన్ అన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న దానికన్నా ఎక్కువ ఆస్తులు ఉంటే బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు రాసిస్తానని ఆయన సవాల్ చేశారు. ఇలాంటి విష ప్రచారం చేస్తుంటే పోలీసు విభాగం ఏం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో డీజీపీకి ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు చర్యలు తీసుకోకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలు స్పందిస్తారని బాల్క సుమన్ అన్నారు. పోలీసులు సుమోటోగా కేసులు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా డీజీపీ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!
నిరుద్యోగంపై బండి సంజయ్ దీక్ష హాస్యాస్పదం
'సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన వారిని కచ్చితంగా శిక్షించాలి. మంత్రులపై అసభ్య ప్రచారం జరుగుతుంటే పోలీసులు కచ్చితంగా స్పందించాలి. నిరుద్యోగంపై బండి సంజయ్ దీక్ష చేస్తానని ప్రకటించడం హాస్యాస్పదం. దేశంలో నిరుద్యోగం పెరుగుతుంటే ప్రధాని మోదీ ఏంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షల 72 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయరా?. జాతీయ స్థాయి నిరుద్యోగ రేటుతో పోలిస్తే రాష్ట్ర స్థాయి నిరుద్యోగ రేటు చాలా తక్కువ. పార్లమెంటులో తెలంగాణ నిరుద్యోగ రేటు తక్కువ అని కేంద్రం చెప్పింది బండి సంజయ్ కు తెలియదా?. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాలపై బహిరంగ లేఖ విడుదల చేశారు. దమ్ముంటే బండి సంజయ్ కేంద్ర ఉద్యోగాలపై శ్వేత పత్రం ఇప్పిస్తారా?. 36 ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మేసింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. తెలంగాణ వ్యవసాయాన్ని దెబ్బ తీయడమే బీజేపీ లక్ష్యం. రైతుల విషయంలో రాజకీయం చేస్తోంది బీజేపీయే టీఆర్ఎస్ కాదు.' టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
Also Read: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
రేవంత్ కు నెత్తి లేదు కత్తి లేదు
బీజేపీ మీద పోరాటంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని బాల్క సుమన్ విమర్శించారు. మీడియా లో స్పేస్ కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటపడుతున్నారు. రేవంత్ కు నెత్తి లేదు కత్తి లేదని, బీజేపీ టీఆర్ఎస్ సంబంధాలపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. దేశ సమస్యలపై రాహుల్ గాంధీ దిల్లీలో ఎందుకు నిరాహార దీక్ష చేయరో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.