Nara Lokesh: 'మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా' - టీడీపీ అధిష్టానం కీలక ఆదేశాలు
Andhra News: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలన్న డిమాండ్ వినిపిస్తోన్న వేళ టీడీపీ హైకమాండ్ ఆ పార్టీ నేతలకు కీలక ఆదేశాలిచ్చింది. ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని స్పష్టం చేసింది.

TDP High Command Key Announcement: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను (Nara Lokesh) డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి బలంగా వినిపిస్తోన్న వేళ సోమవారం టీడీపీ అధిష్టానం (TDP High Command) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని ఆ పార్టీ నేతలను ఆదేశించింది. మీడియా వద్ద కానీ, బహిరంగంగా కానీ ఈ వ్యవహారంపై స్పందించొద్దని.. ఎలాంటి ప్రకటనలు చెయ్యొద్దని స్పష్టం చేసింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని.. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దొద్దని పేర్కొంది.
అక్కడి నుంచి మొదలు
కాగా, ఇటీవల సీఎం చంద్రబాబు కడప జిల్లా మైదుకూరు (Mydukuru) పర్యటనలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి.. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అనంతరం ఆ పార్టీ సీనియర్ నేతలు సైతం ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. ఆయన పార్టీ కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నారని.. యువగళం పాదయాత్రతో పోరాట పటిమను నిరూపించుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో పార్టీతో సంబంధం లేకపోయినా ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను వారు చెబుతూ వచ్చారు. మాజీ మంత్రి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని పార్టీ అధిష్టానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలను కూటమి పెద్దలు కూర్చుని చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. ఈ క్రమంలో ఎవరూ ఈ అంశాలపై మాట్లాడొద్దని స్పష్టం చేసింది.
అయితే, ఎన్నికల్లో యువగళం పాదయాత్రతో పాటు మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించడం వరకూ లోకేశ్ ఎక్కడా తగ్గలేదు. ప్రచారం నుంచి మంత్రి పదవి చేపట్టిన వరకూ పదవి చేపట్టిన అనంతరం తనదైన శైలిలో ప్రజలతో మమేకమయ్యారు. ప్రచార సమయంలోనూ నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తూ వారికి మరింత దగ్గరయ్యారు. పదవి చేపట్టిన అనంతరం అటు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలతోనూ ఇటు కార్యకర్తల సమస్యలు పరిష్కారం చేస్తూ కేడర్‌తోనూ దూసుకెళ్తున్నారు. ట్విట్టర్ ద్వారా ప్రజల నుంచి వస్తోన్న విజ్ఞప్తులను సైతం పరిష్కరిస్తూ లోకేశ్ పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కోటి మంది దాటడంలోనూ కీలకంగా వ్యవహరించారు. తన ప్రసంగాల్లోనూ పదను పెంచిన లోకేశ్.. ప్రతిపక్షాల విమర్శలను సైతం బలంగా తిప్పికొడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి పనైనా నారా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతుందన్న ప్రచారం బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లోనే లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ లీడర్ల నుంచి డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
Also Read: Pawan Kalyan: గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

