RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Kolkata Trainee Doctor Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్‌కు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Court Verdict On Rg kar Murder Case: దేశంలోనే సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ (Kolkata Trainee Doctor) హత్యాచారం కేసులో సోమవారం సీల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు (Sanjay Roy) జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా అతనికి రూ.50 వేల జరిమానా సైతం విధించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను శనివారం దోషిగా తేల్చిన న్యాయస్థానం సోమవారం శిక్ష ఖరారు చేసింది. కాగా, గతేడాది ఆగస్ట్ 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తోన్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తీవ్రమయ్యాయి.
పశ్చిమబెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. అయితే, సామూహిక అత్యాచార విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆస్పత్రి ఆవరణలోని సీసీ టీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్ట్ 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇంఛార్జీ అభిజిత్ మండల్‌ను అరెస్ట్ చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్ట్ కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టైన దగ్గర నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.
నన్ను ఇరికించారు - సంజయ్ రాయ్
అటు, శిక్ష ఖరారు చేయడానికి ముందు తన వాదన వినిపించుకునేందుకు సంజయ్‌కు న్యాయమూర్తి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా తాను ఏ నేరం చేయలేదని.. తనను ఇరికించారని కోర్టుకు తెలిపాడు. 'ఏ కారణం లేకుండానే నన్ను ఇందులో ఇరికించారు. నన్ను దోషిగా నిలబెట్టారు. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలు ధ్వంసమయ్యాయని నేను విన్నాను. నన్ను ఇరికించారో లేదో దానిని బట్టి మీరే నిర్ణయించుకోండి. బలవంతంగా నాతో కాగితాలపై సంతకాలు చేయించారు. నేను అమాయకుడిని. నేను ఎప్పుడూ రుద్రాక్ష ధరిస్తాను. నేను నేరం చేసి ఉంటే అవి ఘటనా స్థలంలోనే ఉండిపోయి ఉండేవి. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మీరు ఇవన్నీ చూశారు. నన్ను ఈ కేసులో ఇరికించిన ఐపీఎస్ అధికారి సహా అందరినీ ఎందుకు విడుదల చేశారు.?' అని పేర్కొన్నాడు.
న్యాయమూర్తి తీర్పు అనంతరం పోలీసులు దోషిని కోర్టు రూం నుంచి పటిష్ట బందోబస్తు మధ్య ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోంకు తరలించారు. ఈ తీర్పు విని బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. న్యాయవ్యవస్థపై తాము ఉంచుకున్న నమ్మకాన్ని న్యాయస్థానం నిలబెట్టుకుందని తెలిపారు. కాగా, నిందితునికి మరణ శిక్ష విధించాలనే డిమాండ్లు బలంగా వినిపించాయి.
Also Read: Sharon Raj Murder Case: ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

