Sharon Raj Murder Case: ప్రియుడి హత్య కేసులో తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు, యువతికి ఉరిశిక్ష!
Kerala Sharon Raj Murder Case: సంచలనం రేపిన శరోన్ రాజ్ హత్య కేసులో అతడి ప్రియురాలికి కోర్టు ఉరిశిక్ష విధించింది. తిరువనంతపురం కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది.

Death Sentence to Lover | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్య కేసులో యువతికి కోర్టు మరణశిక్ష విధించింది. 2022లో కేరళలో ప్రియుడు శరోన్ రాజ్‌కు విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి హత్య చేసింది గ్రీష్మ. ఈ కేసులో ఇదివరకే విచారణ పూర్తయింది. గ్రీష్మను దోషిగా కోర్టు నిర్ధారించింది. ఈ హత్యలో ఆమెకు సహకరించిన బంధువుకు న్యాయమూర్తి మూడేళ్ల జైలుశిక్ష విధించారు. ఓ వ్యక్తి ప్రాణం తీయడం హేయమైన నేరమని, అంత పెద్ద తప్పు చేసిన శరోన్ రాజ్ ప్రియురాలు గ్రీష్మకు తిరువనంతపురం కోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే..
తిరువనంతపురానికి చెందిన శరోన్ రాజ్ (23) హత్య కేసులో అతడి ప్రియురాలు గ్రీష్మకు కేరళ కోర్టు సోమవారం (జనవరి 20న) మరణశిక్ష విధించింది. బీఎస్సీ రేడియాలజీ చివరి సంవత్సరం విద్యార్థి శరోన్ రాజ్, తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన గ్రీష్మ ఓ కాలేజీలో చదువుకునే సమమయంలో ప్రేమలో పడ్డారు. వీరి పరిచయం ప్రేమగా మారి, దాదాపు ఏడాదిపాటు వీరు రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఆర్మీలో పనిచేసే వ్యక్తితో 2022లో వివాహం నిశ్చయమైంది. ఈ విషయాన్ని ప్రియుడు శరోన్ రాజ్‌కు చెప్పి, అతడ్ని దూరం పెట్టడం ప్రారంభించింది. పీకల్లోతు ప్రేమలో ఉన్న శరోన్ రాజ్ ఆమె ప్రేమ తనకే దక్కాలని పదేపదే ఆమెకు చెప్పి చూశాడు. మరోవైపు పెళ్లికి సమయం దగ్గర పడుతుండటం, శరోన్ రాజ్ ఏమో తనను వదిలి పెట్టవద్దని గ్రీష్మతో చెబుతూనే ఉన్నాడు.
ప్లాన్ ప్రకారం హత్య
ఎలాగైనా ప్రియుడ్ని వదిలించుకోవాలని చూసిన గ్రీష్మ ఏకంగా అతడ్ని హత్య చేయాలని ప్లాన్ చేసింది. తన మామతో కలిసి ప్రియుడు శరోన్ రాజ్ హత్య చేయాలని భావించింది. అక్టోబర్ 14, 2022న కన్యాకుమారిలోని తన నివాసంలో గ్రీష్మ వద్దకు వెళ్లిన సమయంలో విషం కలిపిన జూస్ ఇవ్వగా శరోన్ రాజ్ తాగాడు. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన అతడు కొన్నిరోజుల్లోనే చనిపోయాడు. అతడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గ్రీష్మ ఫ్యామిలీపై కేసు నమోదైంది.
డీవైఎస్పీ జాన్సన్ నేతృత్వంలోని క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు దర్యా్ప్తు చేపట్టింది. అక్టోబర్ 31, 2022న గ్రీష్మను అరెస్టు చేశారు. ఏడాది పాటు కస్టడీలో ఉన్న గ్రీష్మ, కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సెప్టెంబర్ 25, 2023న జైలు నుంచి విడుదలైంది. మరోవైపు దర్యాప్తులో గ్రీష్మ, ఆమె మామ కలిసి ఇదంతా చేసినట్లు పోలీసులు గుర్తించి కోర్టుకు ఆధారాలు సమర్పించారు. విచారణ చేపట్టిన
నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జనవరి 17న ఇద్దరినీ దోషులుగా తేల్చారు. ఐపీసీ సెక్షన్లు 364, 328, 302 (హత్యకు శిక్ష), 201 సెక్షన్ల కింద కింద గ్రీష్మను దోషిగా తేల్చింది. తన స్వార్థం చూసుకునేందుకు ఓ వ్యక్తిని హత్య చేయడం, సాక్ష్యాధారాలు మాయం చేసి పోలీసులను తప్పుదోవ పట్టించడం లాంటి విషయాలను కోర్టు తీవ్రంగా పరిగణించి తీర్పు వెలువరించింది. ఈ కేసులో గ్రీష్మ తల్లికి సంబంధం ఉందని బాధిత కుటుంబం ఆరోపించింది. కానీ అందుకు సాక్ష్యాలు లభ్యంకాకపోవడంతో ఆమెను నిర్దోషిగా కోర్టు తేల్చింది.






















