CM Chandrababu: 'అన్ని దేశాల్లో తెలుగు వాళ్ల ఫుట్ ప్రింట్ ఉంటుంది' - తెలుగు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Telugu Industrialists: తనకు మరో జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవున్ని కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు న్యాయపోరాటానికి అంతా మద్దతు తెలిపారని గుర్తు చేశారు.

AP CM Chandrababu Meeting With Telugu Industrialists In Zurich: ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగువాళ్లు ఫుట్ ప్రింట్ ఉంటుందని.. అదే మన గొప్పతనమని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆయన జ్యురిచ్‌లో (Zurich) అక్కడి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుంది. అందుకే రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ప్రోత్సహించాను. యూరప్‌లోని 12 దేశాల నుంచి వ్యాపారవేత్తలు ఈ సమావేశానికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. అవకాశం ఉన్న ప్రతిచోటుకీ మనవాళ్లు వెళ్లిపోతారు. తెలుగువాళ్లు ఎక్కడైనా గొప్పగా రాణిస్తారు.' అని కొనియాడారు.
ఆ 53 రోజులూ..
'తాను 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు చేసిన న్యాయపోరాటానికి వివిధ దేశాల్లోని తెలుగు వాళ్లు మద్దతుగా నిలిచారు. అప్పుడు అన్ని దేశాల్లో తెలుగువారు ఉన్నారా.?. అని ఆశ్చర్యపోయా. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నా. యువతలో సరికొత్త ఆలోచనలు రావాలి. చైతన్యవంతులు కావాలి.' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని.. యువత గ్రామాల నుంచి నగరాలకు వచ్చి ఇంజినీరింగ్ విద్య అభ్యసించి ఐటీ రంగంలోకి వచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. 'హైదరాబాద్‌లో భూములు అమ్ముకోవద్దని చాలామందికి చెప్పాను. తెలంగాణలో తలసరి ఆదాయానికి హైదరాబాద్ సంపదే కారణం. సంపద సృష్టించడం కష్టం కాదు. 2047 నాటికి తెలుగువాళ్లు గొప్పగా ఉండాలనేదే నా లక్ష్యం. ఉక్రెయిన్‌లో సమస్య వచ్చినప్పుడు ప్రవాసాంధ్రులు బాగా పనిచేశారు. మీరు ఎక్కడికి వెళ్లినా మూలాలు మరిచిపోకూడదు. రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రవాసాంధ్రులను ఎలా ప్రోత్సహించాలన్న దిశగా ఆలోచన చేస్తున్నాం. నిరంతర శ్రమ వల్లే తెలుగు వారు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఏపీని వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా చేయాలన్నదే నా లక్ష్యం. మ్యాన్ పవర్‌ను ఫిజికల్ లేదా వర్చువల్‌గా నియమించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏఐ, చాట్ జీపీచీ నైపుణ్యం పెంచుకోవాలి.' అని పిలుపునిచ్చారు.
'జ్యురిచ్ లేదా జువ్వలపాలెం..'
మరోవైపు, వ్యాపారవేత్తలు, యూరప్ ఎన్నారై టీడీపీ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. పిలవగానే ఇంతమంది వస్తారని ఊహించలేదని.. ఇక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే జ్యురిచ్‌లో ఉన్నామా.. లేక జువ్వలపాలెంలో ఉన్నామా.? అర్థం కావడం లేదని హర్షం వ్యక్తం చేశారు. 'తెలుగు జాతి సత్తా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు. ఆనాడు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. నేడు అదే నిజం అయ్యింది. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఆయన్ను అరెస్ట్ చేసిన సమయం నా జీవితంలో అత్యంత కష్టమైన సమయం. ఆ టైంలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచించారు. ప్రపంచం, దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా చంద్రబాబు ఎదిగారు.' అని లోకేశ్ పేర్కొన్నారు.






















