(Source: Poll of Polls)
Bandi Sajay: హుజూరాబాద్ లో బీజేపీ భారీ విజయం సాధించబోతుంది : బండి సంజయ్
హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పార్టీ విజయం కోసం కష్టపడిన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు.
హుజూరాబాద్ ఉపఎన్నికపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. హజూరాబాద్ ఉపఎన్నిక ఓటింగ్ లో పాల్గొన్న ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ శ్రేణుల నుంచి అందిన సమాచారం ప్రకారం బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారన్నారు. వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా వ్యవహరించి, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు.
Also Read:డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?
అధికార దుర్వినియోగం
టీఆర్ఎస్ ఓట్లను అడ్డగోలుగా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా అసత్యపు ప్రచారాలు, అబద్ధపు మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించిందని బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి న్యాయం వైపు, బీజేపీ వైపు నిలిచారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎంత డబ్బు ఖర్చుపెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు నిష్పక్షపాతంగా న్యాయం, ధర్మం వైపు నిలిచారన్నారు. టీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. అధికార యంత్రాంగంతో బీజేపీపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా విజయం కోసం కృషి చేశారని బండి సంజయ్ అన్నారు.
Also Read: తెలంగాణ రాజకీయాల్ని మార్చనున్న హుజురాబాద్ ఫలితం ! రాజకీయ పార్టీలన్నింటికీ లిట్మస్ టెస్టే
ఇదే స్ఫూర్తితో పనిచేయండి
కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు ఒక మంచి ఆలోచనతో బీజేపీ పార్టీని ఆదరించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ కోసం గత కొన్ని రోజులుగా తమ కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు. రాత్రి పగలు పార్టీ విజయం కోసం పాటుపడ్డారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో శ్రేణులు మరింత కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడాలని కోరారు.
Also Read: హుజురాబాద్‌లో రికార్డు స్థాయి పోలింగ్.. చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి