Telangana Assembly : 15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?
Speaker election : స్పీకర్ ఎన్నికలో విపక్షాలు పోటీ పెడతాయా ?. 15వ తేదీన స్పీకర్ ఎన్నిక జరగనుంది.
Telangana Assembly Speaker election : తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక కసరత్తు ప్రారంభమయింది. సోమవారం రోజు స్పీకర్ ఎన్నికల కోసం బులెటిన్ విడుదల చేస్తారు. స్పీకర్ నామినేషన్ల కోసం రెండు రోజుల గడువు ఉంటుంది. ఈ నెల 14న గురువారం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 15 న గురువారం రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రకటించింది. ఆయనే కాంగ్రెస్ తరపున నామినేషన్ వేస్తారు. ఇతర పార్టీల నుంచి ఎవరైనా నిలబడతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అలాంటి ఆలోచన ఉన్నట్లుగా కూడా ఏ పార్టీ ప్రకటించలేదు. శుక్రవారం అసెంబ్లీ, మండలి సంయుక్త సమావేశం ఉంటుంది. గవర్నర్ ప్రసంగిస్తాు. శనివారం రోజు గవర్నర్ స్పీచ్ కు ధన్యవాదాలు తీర్మానం.. ముఖ్యమంత్రి రిప్లై ఉంటుంది.
అంతకు ముందు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యేలతో పాటు ఒక సీపీఐ ఎమ్మెల్యే ప్రమాణం చేశారు. అనంతరం ఈ నెల 14వ తేదీకి అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేస్తూ ప్రొటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని కాంగ్రెస్ నియమించడంతో తీవ్ర అసహనానికి గురైన బీజేపీ ఎమ్మెల్యేలు.. పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాకే ప్రమాణం చేస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు కేసీఆర్ అనారోగ్యం కారణంగా కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.
మరో వైపు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన రెండో రోజు అసెంబ్లీ గేటు ముందు తొలి నిరసన బీజేపీ ఎమ్మెల్యే చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించింది. అయితే అందరూ అసెంబ్లీ దగ్గరకు వచ్చారు. అసెంబ్లీ గేట్ నెంబర్ 2 వద్ద రోడ్డుపై కూర్చొని బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కన్నా ఐదుగురు సీనియర్ ఎమ్మెల్యేలు ఉండగా అక్బరుద్దీన్‌కు ఏవిధంగా ప్రొటెం స్పీకర్ ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారి నిరసనను అడ్డుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు పోలీసులు నచ్చజెప్పి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఎమ్మెల్యేలను తరలించారు.
కాంగ్రెస్ తరపున ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. నిబంధనల ప్రకారం ప్రమాణం చేయాలంటే.. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంది. వారు ఇంకా చేయకపోవడంతో ప్రమాణం చేయలేదు. ఢిల్లీకి వెళ్లి స్పీకర్ కు రాజీనామా లేఖలు ఇచ్చిన తర్వాత వారు ప్రమాణం చేసే అవకాశం ఉంది.