Telangana Elections: తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల, మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే?
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఇవాళ ఈసీ విడుదల చేసింది. మొత్తం మూడు కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారు.
Telangana Elections: మరో రెండు నెలల్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల 17 లక్షల 17 వేల 389 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు కోటి 58 లక్షల 71 వేల 493 మంది ఉన్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక మహిళా ఓటర్లు కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నట్లు ప్రకటించింది. ఇక ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 2,557 మంది ఉన్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఓటర్ల సంఖ్య 5.8 శాతం పెరిగినట్లు పేర్కొంది.
రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య 17.01 లక్షలుగా ఉండగా.. 6.10 లక్షల ఓట్లను తొలగించినట్లు ఈసీ స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో ఓటర్ల జాబితా లింగ నిష్పత్తి 998: 1000గా ఉందని తెలిపింది. ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్లను తొలగించిన తర్వాత 10 లక్షల మంది ఓటర్లు పెరిగారు. బోగస్ ఓట్లు తొలగింపు, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేపట్టిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ఈసీ సిద్దం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించిన తర్వాత ఇవాళ తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు సీఈసీ బృందం వచ్చింది. హైదరాబాద్‌లోని తాజ్ హోటల్‌లో దిగిన సీఈసీ అధికారులు.. 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు. రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల, భద్రతా చర్యలు, డబ్బు పంపిణీ కట్టడిపై రాష్ట్ర అధికారులతో సమావేశం నిర్వహించారు. అలాగే రాజకీయ పక్షాలతో కూడా సీఈసీ అధికారుల సమావేశమయ్యారు.
ఈ సందర్బంగా తుది ఓటర్ల జాబితా ఇప్పుడే ప్రకటించవద్దని అధికారులను టీ కాంగ్రెస్ కోరింది. పూర్తిగా తుది ఓటర్ల జాబితాను పరిశీలించిన తర్వాత ప్రకటించాలని కోరారు. కానీ కాంగ్రెస్ ప్రతిపాదనలను సీఈసీ పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి సర్వే చేపట్టామని, తుది ఓటర్ల జాబితాను పరిశీలించామని ఈసీ స్పష్టం చేసింది. అన్నీ పరిశీలించిన తర్వాతనే తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తున్నట్లు తెలిపింది. బుధవారం సాయంత్రం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయగా.. రాష్ట్రంలోని అన్ని బూత్‌ల వద్ద ప్రదర్శించనున్నారు. అలాగే సీఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా జాబితాను ఉంచనున్నారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు బూత్‌ల వద్ద లేదా వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితాను చెక్ చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. రేపటితో సీఈసీ అధికారులు రాష్ట్ర పర్యటన ముగియనుంది. అనంతరం ఢిల్లీకి బయల్దేరిన తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీలోపు షెడ్యూల్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
గత ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్ నెలలోనే షెడ్యూల్ వచ్చింది. దీంతో ఈ సారి కూడా అక్టోబర్‌లోనే రానుందని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. మ్యానిఫోస్టోను కూడా ముందుగానే ప్రకటిస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినా.. అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో కాంగ్రెస్ తొలి జాబితా రానుంది.