Telangana Election 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం - కాసానికి చంద్రబాబు దిశానిర్దేశం
Telangana Election 2023: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. ఏపీలోని పరిస్థితుల్లో దృష్ట్యా ఇక్కడ దృష్టి సారించలేమని టీటీడీపీ అధ్యక్షుడు కాసానికి చంద్రబాబు ములాఖత్ లో తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి సారించలేమని చంద్రబాబు కాసానికి తెలిపారు. ఏ పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చిందో పార్టీ శ్రేణులకు వివరించాలని సూచించారు. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ నేతలు, శ్రేణులకు వివరిస్తున్నారు.
చంద్రబాబు ఏం చెప్పారంటే.?
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు కాసాని కోరగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి సారించలేమని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని అన్నట్లు సమాచారం. ఒకవేళ, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి అనుకూల ఫలితాలు రాకుంటే బాధ పడాల్సి వస్తుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని కాసానికి వివరించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుతో ములాఖత్ కు ముందు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని భావించారు. పోటీలో నిలవకపోతే పూర్తిగా మనుగడ కోల్పోయే అవకాశం ఉందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతేడాది నుంచే రాష్ట్రంలో టీడీపీ యాక్టివిటీస్ పెరగ్గా, తీరా ఎలక్షన్ టైమ్ లో ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు అరెస్టు కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఎటూ తేల్చలేదు. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో కొన్ని సీట్లైనా గెలిచి సత్తా చాటిన టీడీపీ ఈసారి నిస్సహాయంగా ఉండిపోతోంది.
నిజానికి ఈ ఎన్నికల్లో గట్టిగా నిలబడాలని ఏడాది కిందటి నుంచే ఆ పార్టీ నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనూహ్యంగా ఆ సభ విజయవంతం కావడంతో, తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ లోనూ సభ నిర్వహించారు. దాంతో టీడీపీ నాయకత్వం క్రమంగా కింది స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఔత్సాహికులు కొంతమంది పార్టీలోనూ చేరారు. అయితే, సరిగ్గా ఎన్నికల ముందు ఏపీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడం ఈ పరిస్థితినే తలకిందులుగా చేసింది. తెలంగాణలో ఆ పార్టీ శ్రేణులు, నేతలు నిరాశలో మునిగిపోయారు.
Also Read: చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల - కంటికి ఆపరేషన్ చేయాలన్న డాక్టర్లు