(Source: ECI/ABP News/ABP Majha)
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కోర్టులో చుక్కెదురు.. ఇక నేటి నుంచి..
నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. దీంతో ఇవాల్టి నుంచి మల్లన్నను పోలీసులు విచారణ జరపనున్నారు.
క్యూ న్యూస్ సీఈవో, జర్నలిస్టు అయిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌కు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్టు కొట్టేసింది. తీన్మార్ మల్లన్నను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా.. అందుకు కోర్టు అంగీకరించింది. నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. దీంతో ఇవాల్టి (సెప్టెంబరు 4) నుంచి నాలుగు రోజుల పాటు తీన్మార్ మల్లన్నను చిలకలగూడ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నాలుగు రోజులు విచారణ జరపనున్నారు.
మరోవైపు, తీన్మార్ మల్లన్న కేసులో దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మల్లన్న భార్య మత్తమ్మ ఈ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మల్లన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోలీసులు నమోదు చేసిన 306, 511 సెక్షన్లు తొలగించాలని పిటిషనర్ కోరారు. అయితే, కింది కోర్టులో బెయిల్ అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నందున దానిపై స్టే ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 14కి వాయిదా వేసింది.
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని ప్రచారం
తనపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా తీన్మార్ మల్లన్న చంచల్ గూడ జైలులోనే నిరాహారదీక్ష చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశం అయింది. దీనిపై చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ డాక్టర్ డి.శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. తీన్మార్ మల్లన్న జైలులో ఎలాంటి నిరాహార దీక్ష చేపట్టడం లేదని తెలిపారు.
మల్లన్న కుటుంబాన్ని కలిసిన సీతక్క
మరోవైపు, రెండ్రోజుల క్రితం మల్లన్న కుటుంబాన్ని పరామర్శించడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ పరిస్థితిని చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కూర్చోలేని, నడవలేని స్థితిలో ఉన్న మల్లన్న మూడేళ్ల కూతురి పరిస్థితి చూసి ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. సీతక్కను చూసిన మల్లన్న కుటుంబ సభ్యులు తమ కుటుంబ పరిస్థితిని చెప్పి, మల్లన్న అరెస్టుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతూ సీతక్కకు పరిస్థితిని వివరించారు.
🔥 ప్రజా సమస్యలపై గొంతెత్తితే జైళ్లు నోర్లు తెరుస్తాయా…?
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) September 1, 2021
🔥@TeenmarMallanna గారి తల్లి మరియు వారి భార్య పిల్లలు పడుతున్న మానసిక వేదన చూస్తుంటే ఎంతగానో బాధ కలిగింది..#RELEASEMALLANNA @RahulGandhi @priyankagandhi @revanth_anumula @manickamtagore @VenkatBalmoor pic.twitter.com/a4UzrgYx7V