(Source: ECI/ABP News/ABP Majha)
Telangana: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జిలు.. వీళ్లకి పదోన్నతి, సుప్రీం కొలీజయం సిఫార్సు
తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకం జరిగేలా సుప్రీం కొలీజియం ఏడుగురు న్యాయామూర్తులకు సిఫార్సు చేసింది. దీనికి ప్రభుత్వం ఆమోదిస్తే తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిలు నియామకం కానున్నారు.
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయాధికారుల కోటాలో జ్యుడీషియల్ సర్విసెస్ నుంచి వీరి పేర్లను ప్రతిపాదించింది. జస్టిస్ శ్రీలత, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ ఎన్.తుకారాంజీ, జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి, జస్టిస్ మాధవీ దేవిలను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఎ.ఎం. ఖాన్విల్కర్‌ల నేతృత్వంలోని కొలీజియం మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవ చూపి గత జూన్‌లో కోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచేలా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ హైకోర్టులో ఉన్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియామకాలకు ప్రతిపాదించారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్తుండటం, ఇటీవలే జస్టిస్ చల్లాకోదండరాం పదవీ విరమణ పొందడం, జస్టిస్ కేశవరావు కన్నుమూయడంతో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 11కి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కొలీజియం ఒకేసారి ఏడుగురు న్యాయాధికారులకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించింది. ఈ విషయాన్నే కేంద్ర ప్రభుత్వానికి పేర్లను సిఫార్సు చేసింది.
ఈ సిఫార్సు చేసిన వారిలో మహిళలకు పెద్ద పీట వేశారు. ఈ ఏడుగురిని జడ్జిలుగా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి పెరుగుతుంది. అయినా కానీ ఇంకా 24 పోస్టులు ఖాళీగానే ఉండనున్నాయి. ఈ హైకోర్టుకు కేటాయించిన 42 పోస్టుల్లో 28 మందిని న్యాయవాదుల నుంచి, మిగిలిన 14 మందిని రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఎంపికచేసే అవకాశం ఉంటుంది. కాగా, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 2,48,267 కేసులు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 2,11,927 సివిల్ కేసులు. మరో 36,340 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
Also Read: Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి పసిడి, వెండి ధరలివే..
మీడియాపై అసహనం
మరోవైపు, జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం మీడియాపై కాస్త అసహనానికి గురైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తుల నియామకం పూర్తికాకుండానే కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిల నియామక ప్రక్రియకు పవిత్రత, గౌరవం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాంటి విషయాల్లో తొందరపాటుతో వార్తలు రాయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకంపై మీడియాలో వచ్చిన కొన్ని ఊహాగానాలు, కథనాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నట్లు చెప్పారు.
Also Read: Petrol-Diesel Price, 19 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. మీ నగరంలో తాజా ధరలివే..
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు... చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు