(Source: Matrize)
Harish Rao: సిద్దిపేట్ రైల్వే లైన్ - కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్న మంత్రి హరీష్ రావు
Siddipet Railway Line: సిద్దిపేటకు పుష్ పుల్ రైలు రావడం గొప్ప వరమని అన్నారు. నీళ్లు, నిధులు జిల్లా కలను నిజం చేసింది తెలంగాణ సీఎం కేసీఆరే అని తెలిపారు.
Harish Rao On Siddipet Railway Line:
సిద్దిపేట రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ కోట కింద 330 కోట్లు కేటాయించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ.... సిద్దిపేటకు పుష్ పుల్ రైలు రావడం గొప్ప వరమని అన్నారు. నీళ్లు, నిధులు జిల్లా కలను నిజం చేసింది కేసీఆరే అని తెలిపారు. ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని ఆరోపించారు.
బీజేపీ వాళ్లు అబద్ధాలు మాట్లాడుతున్నారు....
బీజేపీ వాళ్లు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దిపేటకు రైలు తెస్తామంటూ బీజేపీ అబద్ధాలు చెప్పిందంటూ మండిపడ్డారు. 2006 వ సంవత్సరంలో రైల్వే లైన్ మంజూరు అయిందని 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైల్వే లైన్ కు రూపకల్పన చేశారని తెలిపారు. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి మారారు కానీ ఏ ఒక్కరూ రైల్వే లోనే తేలేదు అని చెప్పారు.
తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్ర ప్రజల అదృష్టమని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్ష కట్టాయని తెలిపారు. బీజేపీ నాయకులు రైల్వే లైన్ తమ వల్లే వచ్చిందని చెబుతుండడం సిగ్గుచేటన్నారు. 33 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా కడితే కనీసం సీఎం కేసీఆర్ ఫోటో కూడా పెట్టలేదని మండిపడ్డారు. 2,508 ఎకరాల భూసేకరణ కోసం 310 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఇది చూస్తుంటే సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 330 కోట్లు ఇస్తే దీంట్లో కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం తామె కష్టపడ్డామని, డబ్బులు ఇచ్చింది కూడా తామే అని వెల్లడించారు. ఆనాడు 9 ఏళ్ళు కాంగ్రెస్ మోసం చేసిందని, ఈనాడు బీజేపీ అబద్ధాలు ఆడుతుందని ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ లేకపోతే సిద్దిపేటకు రైల్వే లైన్ లేదన్నారు.
సికింద్రాబాద్ -మన్మాడ్ వెళ్లే మార్గంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి రైల్వేలైన్ సిద్దిపేట జిల్లాకు ప్రారంభం అవుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి తదితర ప్రాంతాల వారికి లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. బోయినపల్లి నుంచి కరీంనగర్ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి- నిజమాబాద్ వెళ్లే మార్గంలో కొత్తపల్లి దగ్గర ఈ రైల్వే లైన్ కలుస్తుంది. రైల్వే లైన్ ఇక్కడి ప్రాంత ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరుతాయని మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ కేంద్రంగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. " ప్రధానమంత్రి మోడీ పాలమూరుకు గిరిజన యూనివర్సిటీ ఇస్తానని ప్రకటించారు. 9 ఏళ్ల క్రితం పార్లమెంట్ లో ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. కల్వకుర్తి రూపు రేఖలు మార్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతులకు అవసరమైన ఎరువులను ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందచేస్తోంది. తెలంగాణలో బీజేపీ లేచేది లేదు, కాంగ్రెస్ వచ్చేది లేదు." అని హరీష్ రావు అన్నారు.