KCR : రూమర్స్‌కు చెక్ పెట్టిన ఎమ్మెల్యేలు - ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌తో మరో ఆరుగురు భేటీ
MLAs Meet with KCR : ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మంగళవారం సమావేశానికి వారు రాకపోవడంతో పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది.
Six more MLAs had a meeting with KCR : భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయింపులు పెరిగిపోతున్న సూచనలు కనిపిస్తూండటంతో ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఫామ్ హౌస్‌కు విడతల వారీగా ఎమ్మెల్యేల్ని పిలుస్తున్నారు.. మంగళవారం కొంత మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడారు. ఆ సమావేశానికి కొంత మంది రాకపోవడంతో వారంతా పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఇవాళ అలాంటి ఎమ్మెల్యేలంతా ఫామ్ హౌస్‌కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు.
పలువురు నేతలతో బుధవారం కూడా కేసీఆర్ భేటీ
బుధవారం మరో ఆరుగురు ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీఅయ్యారు. మాజీ మంత్రులు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, గిడ్డంగుల మాజీ చైర్మన్ దివంగత నేత సాయిచంద్ భార్య రజిని కూడా కేసీఆర్ తో సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రలోభాలకు గురి కావద్దని, రాజకీయాల్లో పరిస్థితులు వేగంగా మారుతాయని, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతకు ఎంతో కాలం పట్టదని కేసీఆర్ ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. కేసీఆర్‌తో భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పాలన సాగుతున్న తీరు వంటి చాల అంశాలపై చర్చించామని, అవన్ని సీక్రెట్ అని, బయటకు వెల్లడించలేమని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
భవిష్యత్ బీఆర్ఎస్‌దేనని భరోసా ఇస్తున్న కేసీఆర్
నేతులు పార్టీ వీడిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని .. క్యాడర్ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా కేసీఆర్ రంగంలోకి దిగారు. అందర్నీ ఫామ్ హౌస్‌కు పిలుస్తున్నారు. ఎమ్మెల్సీలపైనా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తుందని తెలియడంతో వారినీ బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ మార్పు విషయంలో తొందర పడవద్దని సూచించారు. పరిస్థితులు భవిష్యత్తులో మన పార్టీకి అనుకూలంగా మారుతాయని భరోసా కల్పిస్తున్నారు.
పలువురు ఎమ్మెల్సీలతోనూ కాంగ్రెస్ సంప్రదింపులు
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ భారీగా కోల్పోయింది. దీంతో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు భవిష్యత్ భయం ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వారిగా పేరు పడిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల సంజయ్ కుమార్ వంటి వారు కాంగ్రెస్ లో చేరడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి బీఆర్ఎస్‌లో ఏర్పడింది. ఉన్న వారిపైనా కాంగ్రెస్ ఆకర్ష్ ప్రయోగిస్తుందని తెలియడంతో వారికి ఇస్తున్నారు. వారిలో ఎంత మంది కేసీఆర్ వెంట ఉంటారన్నది అసెంబ్లీ సమావేశాల్లోపు తేలిపోయే అవకాశం ఉంది.