Singareni Elections: ముగిసిన సింగరేణి ఎన్నికల ప్రచారం, పోలింగ్ తేదీ పూర్తి వివరాలివే
Singareni Elections Date: సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. 13 గుర్తింపు పొందిన సంఘాలు ఈ ఎన్నికల బరిలోకి దిగాయి.
Singareni Elections Campaign Ends: దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత జరుగుతున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం (Singareni Elections Campaign closed) నేటితో ముగిసింది. 13 గుర్తింపు పొందిన సంఘాలు ఈ ఎన్నికల బరిలోకి దిగాయి. డిసెంబర్ 27వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు (Singareni Elections to be held on 27 December) నిర్వహించనున్నారు. నైజాం ఏరియాలో సింగరేణి ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తాయి ఆయా రాజకీయ పార్టీలు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఎన్నికల బరిలోకి 13 గుర్తింపు సంఘాలు
భూపాలపల్లి సింగరేణి డివిజన్ లో ఓపెన్ కాస్ట్ లతో కలుపుకొని 5 గనులు ఉన్నాయి. ఇందులో 5 వేల 350 కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా ఈనెల 27న జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 13 గుర్తింపు సంఘాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 20 రోజులుగా సింగరేణి కార్మిక గుర్తింపు సంఘాలు ఓట్ల కోసం కార్మికుల చుట్టూ తిరుగుతూ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. నేటితో ప్రచారం ముగియడంతో.. ఇక మిగిలింది ప్రలోభాల పర్వం. కొందరు మందు, విందుతో కార్మికుల ఓట్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రచారానికి చివరి రోజు కావడంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకుడు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి గనుల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. గత ప్రభుత్వం సింగరేణి పట్టించుకోకుండా సంస్థను అవినీతిమయం చేసిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ 9 సంవత్సరాలుగా కృష్ణవేణి సంస్థను అవినీతిమయం చేశారని ఆరోపించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు లేకుండా చేసిన క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా వారసత్వ ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కార్మికుల పక్షాన నిలిచింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అని పేర్కొన్నారు.
నాలుగు యూనియన్ల మధ్య పోటీ
బొగ్గుగని ఎన్నికల్లో ప్రధానంగా నాలుగు యూనియన్ల మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ అనుబంధ యూనియన్ INTUC, బీఆర్ఎస్ అనుబంధ యూనియన్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ, బీజేపీ అనుబంధ సంఘం BMS లు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు సిద్ధమయ్యాయి. 2017 జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గుర్తింపు సంఘాల నిలిచింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూనియన్ ఐఎన్‌టీయూసీ గుర్తింపు సంఘంగా నిల్చునేందుకు కసరత్తు చేస్తోంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని, ఎవరు అధికారంలో ఉన్న ఆ పార్టీలకు అనుకూలంగా ఎన్నికలను మలుచుకుంటున్నారని బీఎంఎస్ గుర్తింపు సంఘం నాయకులు ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్వంతంగా పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీకి సీపీఐ, వైఎస్సార్ తెలంగాణ పార్టీ మద్దతు ప్రకటించాయి. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి సి సంఘం ఒంటరి పోరుకు సిద్ధమైంది. సింగరేణి వ్యాప్తంగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించిన అనంతరం ఆయా ఏరియాల్లో అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.