Vande Bharat Express : తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి గిఫ్ట్, ఈ నెల 15న వందే భారత్ రైలు ప్రారంభం
Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం సంక్రాంతి గిఫ్ట్ ఇవ్వనుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 15న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Vande Bharat Express : తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చేసింది. బుధవారం విశాఖ చేరుకున్న వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలను ఈనెల 15న ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. ఈనెల 15వ తేదీ ఉదయం10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా వందే భారత్ రైలు కూత పెట్టనుంది. అయితే ఈనెల19న ప్రధాని మోదీ ఈ రైలును ప్రత్యక్షంగా ప్రారంభిస్తారని ప్రకటించారు. కానీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వాయిదా పడడంతో పండగ సమయంలో వందే భారత్ రైలును ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడవనుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8.40 గంటల్లో విశాఖ చేరుకుంటుంది.
A Sankranti gift to the People of Telangana & Andhra Pradesh!
— G Kishan Reddy (@kishanreddybjp) January 11, 2023
In a major boost to rail connectivity in both the states, Hon'ble PM Shri @narendramodi will virtually flag off the 8th Vande Bharat Train from Secunderabad Railway Station.
📆 15th Jan, 2023
⌚ 10:00 am pic.twitter.com/dvGaJWP9xm
16 బోగీలు, 1128 ప్రయాణికులు
తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఇప్పటికే విశాఖకు చేరుకుంది. చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీ నుంచి నేరుగా విశాఖ రైల్వేస్టేషన్‌కు ఈ రైలును తరలించారు. ఈ రైలులో 16 బోగీలు చైర్ కార్ ఉంటాయి. వాల్తేరు కోచింగ్ కాంప్లెక్స్ లో పర్యవేక్షణ అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్‌కు గురువారం ఉదయం బయలుదేరనున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. మొత్తం 1128 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉందని అధికారులు వెల్లడించారు. ఒక్కో కోచ్ పొడవు 23 మీటర్లు కాగా, 52 మంది కూర్చునేలా ఫస్ట్ క్లాస్ కోచ్‌లు రెండున్నాయి. రైలును స్లైడింగ్ డోర్లు, రీడింగ్ లైట్స్, అటెండెంట్ కాల్ బటన్లు, ఆటోమెటిక్ ఎగ్జిట్, ఎంట్రీ డోర్లు, సీసీటీవీ కెమెరాలు, పడుకునే సౌకర్యం కలిగిన కుర్చీలతో అత్యధునికంగా తీర్చిదిద్దారు. ఈ ట్రైన్ పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షలో ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు లోకో పైలెట్ క్యాబిన్‌కు అనుసంధానించి ఉంటాయి. లోకో పైలెట్ కంట్రోల్లోనే కోచ్‌ల తలుపులు తెరుచుకునే, మూసివేసే విధంగా వ్యవస్థను రూపొందించారు. మెట్రో రైల్లో మాదిరిగా ప్రయాణికుల అత్యవసర సహాయం కోసం టాక్ బ్యాక్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.
విశాఖ చేరుకున్న వందే భారత్ రైలుపై రాళ్ల దాడి
వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలిసారిగా విశాఖకు చేరింది. కానీ కొందరు అల్లరిమూక వందే భారత్ రైలుపై బుధవారం సాయంత్రం మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడికి పాల్పడటం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన విశాఖ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో వందేభారత్ రైలుపై దాడిచేసి కిటికీలు ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, అందుకే ఈ దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్పీఎఫ్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు.