ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదనలు
తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 61 ఏళ్లకు పెంచాలంటూ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 61 ఏళ్లకు పెంచాలంటూ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల 61 ఏళ్లుగా నిర్ణయించారని, వారిలాగే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 పెంచాలని కోరింది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ సర్వీసులో విలీనం చేసే బిల్లుకు ఇప్పటికే అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం లభించింది. ప్రభుత్వ సర్వీసులో విలీనంపై విధివిధానాలు, ఉద్యోగుల క్యాడర్ ఖరారుకు ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వయో పరిమితి పెంపు ప్రతిపాదనను కమిటీకి అందించాలని రవాణాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్టీసీ ఎండీకి ఈ నెల 11న లేఖ రాశారు.
43,373 మంది ఉద్యోగులు
ఆగస్టులో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వస్తే.. ఆర్టీసీలో పనిచేస్తున్న మొత్తం 43,373 మంది ఉద్యోగులు సర్కారీ ఉద్యోగులుగా మారతారు. వారికి ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లించాలని నిర్ణయించింది. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజారవాణా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మె చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ సానుకూల నిర్ణయం వెలువరించింది. దీనిపై విధివిధానాలు, నిబంధనలను రూపొందించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆర్‌అండ్ బీ, రవాణాశాఖ, జీఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది.
15వందల కోట్లు నష్టం వచ్చేది
టీఎస్ ఆర్టీసీ కార్పోరేషన్ అయినా కూడా నష్టాలు వస్తుండడంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 1500 కోట్లు ఇవ్వాల్సి వచ్చేది. బయట నుంచి ఆర్టీసీని నిలబెట్టుకుంటూ ఎన్ని సంవత్సరాలు గడిపినా లాభాల బాటలో పయనించే పరిస్థితులు కనిపించలేదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన డీజిల్ ధరలతో అది సాధ్యం కాలేదు. గతంలో లీటరుకు రూ. 60 ఉన్న డీజిల్ ధర ఇప్పుడు సుమారు వంద వరకు రావడంతో సంస్థపై విపరీతమైన ఆర్థిక భారం పడింది. ప్రతి రోజు సుమారు 40 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండటంతో 6 లక్షల లీటర్ల డీజిల్ ఉపయోగిస్తున్నారు. ఎంత ప్రయత్నించిన లాభాల బాటలో పయనించే పరిస్థితి లేకపోయింది. లాభం లేదని భావించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేశారు. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై సెప్టెంబరు 14న గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం శాసన సభలో బిల్లులను ప్రవేశపెట్టింది. వాటిని గవర్నర్‌కు పంపించగా.. ఆమె కొన్ని అంశాలపై అధికారుల వివరణ అడిగారు. అంతేకాకుండా 10 సిఫారసులు చేశారు. వీటిపై ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన తమిళిసై బిల్లుకు ఆమోదం తెలిపారు.
బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు ఆర్టీసీలో 43,373 మంది ఉద్యోగులు, కార్మికులు ఉండేవారు. ఆగస్టులో 343 మంది రిటైర్ అయ్యారు. సంస్థలో ప్రస్తుతం ఉద్యోగ విరమణ వయసు 60 సంవత్సరాలు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లు. నోటిఫికేషన్ వచ్చాక ఆర్టీసీలో విరమణ వయసు మరో ఏడాది పెరగనుంది. అయితే వయో పరిమితిని 60 ఏళ్లకే పరిమితం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా కార్మికుల్లో ప్రచారం జరిగింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 61 ఏళ్లకు పెంచాలంటూ, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.