Hyderabad: మూసీ రివర్ ఫ్రంట్ పై హై ఫోకస్- ప్రపంచ దృష్టిని ఆకర్షించే డిజైన్లు, నమూనాలు
Revanth Dubai Tour: హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపైనే కీలక సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు.
Musi River News: హైదరాబాద్: లండన్ నుంచి బయల్దేరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) ఆదివారం దుబాయ్లో బిజీబిజీగా గడిపారు. హైదరాబాద్ సిటీలో మూసీ రివర్ ఫ్రంట్ డిజైన్లు, అభివృద్ధిపైనే కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రపంచ స్థాయి సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అయ్యారు. 56 కిలోమీటర్ల పొడవునా మూసీ రివర్ ఫ్రంట్, గ్రీన్ అర్బన్ పార్క్ లు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు, అభివృద్ధి నమూనాలు, వాటికి అవసరమైన పెట్టుబడులపై వివిధ సంస్థలతో రేవంత్ చర్చలు జరిపారు.
70 సంస్థలతో రేవంత్ చర్చలు
దుబాయ్ లో దాదాపు 70 సంస్థలతో సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలు, డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సమావేశమయ్యారు. దాదాపు అన్ని సంస్థలు తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి, హైదరాబాద్ లో మూసీ రివర్ డెవెలప్మెంట్ ప్రాజెక్టుపై ఆసక్తి ప్రదర్శించాయి. తదుపరి సంప్రదింపులకు త్వరలోనే రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించాయి.
ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రాత్మక నగరాలన్నీనీటి వనరుల చుట్టే అభివృద్ధి చెందాయన్నారు. నదులు, సరస్సులు వాటికి సహజత్వాన్ని తెచ్చిపెట్టాయని... మూసీ పునరుద్ధరణతో హైదరాబాద్ సిటీ ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుంది అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ ప్రాజెక్టుకు అపురూపమైన డిజైన్లు, నమూనాలు రూపొందించాలని నిపుణులను, ప్రముఖ సంస్థలను ఆయన కోరారు. ఇతర సిటీలు, రాష్ట్రాలతో తాము పోటీ పడటం లేదని, ప్రపంచంలోనే అత్యుత్తమమైన బెంచ్‌మార్క్ నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని రేవంత్ అన్నారు.
ముగిసిన రేవంత్ పర్యటన.. సోమవారం హైదరాబాద్‌కు
దుబాయ్ లో ఆదివారం వర్కింగ్ డే. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అర్ధరాత్రి వరకు ఈ సంప్రదింపులు కొనసాగించనుంది. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు సీఎం హైదరాబాద్ కు చేరుకుంటారు. సీఎంతో పాటు సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ వి.శేషాద్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, సీఎం స్పెషల్ సెక్రెటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలితో పాటు అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
దుబాయ్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందంతో కలిసి దుబాయ్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టును సందర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఒక స్కై స్కాపర్ (ఆకాశ హర్మ్యం) పైకి వెళ్లి ఏరియల్ వ్యూ లా కనిపించే వాటర్ ఫ్రంట్ అందాలను తిలకించారు.
చుట్టూ నీళ్లు.. పక్కనే ఆకాశాన్ని అంటుతున్నట్లు కనిపించే అందమైన భవంతులు, నీళ్ల చుట్టూ అందమైన రహదారులతో ఒకదానికొకటి అనుబంధంగా రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు దుబాయ్లో పర్యాటకులను అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ప్రాజెక్టు నిర్వహణ వ్యవహరాలు, దాంతో ముడిపడి ఉన్న సామాజిక ఆర్థిక ప్రభావాలను సీఎం అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత సమయం పట్టింది.. ఎంత ఖర్చయింది..? ఏమేం సవాళ్లు ఎదురయ్యాయి..? నిర్వహణకు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.
హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించేందుకు దేశ విదేశాల్లోని వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రతినిధి బృందం అధ్యయనం చేస్తోంది. అందులో భాగంగానే సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం లండన్ లో థేమ్స్ రివర్ ఫ్రంట్ను, దుబాయ్ లో వాటర్ ఫ్రంట్ ను సందర్శించింది.