Telangana Congress Delhi : కర్ణాటక ఫార్ములతో తెలంగాణలో అధికారం - కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం !
కర్ణాటక ఫార్ములాతో తెలంగాణలో పని చేయాలని రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు సూచించారు. స్ట్రాటజీ మీటింగ్‌లో ఫిర్యాదులు చేయాలనుకున్న వారికి రాహుల్ చాన్సివ్వలేదు.
Telangana Congress Delhi : కర్ణాటక తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే ఫార్ములాను రెడీ చేసుకోవాలని పార్టీ నేతలకు రాహుల్ గాంధీ సూచించారు. ఢిల్లీలో జరిగిన స్ట్రాటజీ కమిటీ మీటింగ్‌లో రాహుల్ గాంధీ పూర్తిగా ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి..ప్రజల ముందు ఎలాంటి అంశాలను పెట్టాలన్న అంశంపైనే ఎక్కువగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ధరణి రద్దు హామీ విషయంలో ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందని.. ఆ హామీ గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు. తెలంగాణలో సుదీర్ఘంగా పరిష్కారానికి నోచుకోని పోడు భూములు, అసైన్డ్ భూములు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వంటి అంశాలపైనా పార్టీ నేతల అభిప్రాయాలను రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు.
కంప్లైంట్లతో వెళ్లిన వారికి చాన్సివ్వని రాహుల్
తెలంగాణలో పార్టీ టిక్కెట్ల అంశం పూర్తిగా కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చూసుకుంటుందని.. టిక్కెట్ల అంశంపై ఒక్క నేత కూడా ఎలాంటి ప్రకటన చేయవద్దని రాహుల్ గాంధీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఈ స్ట్రాటజీ సమావేశంలో చాలా మంది కాంగ్రెస్ నేతలు తమ అసంతృప్తి స్వరాన్ని వినిపించేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఎవర్నీ నోరు మెదపనీయలేదని అంటున్నారు. తమపై పార్టీలో దుష్ప్రచారం చేస్తున్నారని స్ట్రాటజీ మీటింగ్ లో తేల్చుకుంటామని సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో కూడా చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వారు నోరు మెదపలేకపోయారు. ఓ దశలో జగ్గారెడ్డి ఏదో మాట్లడటానికి ప్రయత్నించడంతో తెలంగాణ పార్టీలో ఎవరెవరు ఏమిటో తనకు పూర్తిగా తెలుసని ఏమీ చెప్పాల్సిన పని లేదని స్పందించినట్లుగా తెలుస్తోంది.
వచ్చే ఎన్నికలను పార్టీ ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే చర్చలు
మరో వైపు రేణుకా చౌదరి కూడా ఏఐసిసి సెక్రటరీగా ఉన్న నదీమ్ ను అనే నేతను తీసేయడంపై ప్రశ్నించారు. కొన్ని కారణాల వల్ల తీసేశామని.. దానిపై డిస్కషన్ అవసరం లేదని రాహుల్ చెప్పడంతో ఆమె కూడా సైలెంట్ అయినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో పొత్తుల విషయంలో రాహుల్ క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్‌తో పొత్తు అనే ప్రశ్నే ఉండదని తేల్చి చెప్పారు. జాతీయ స్థాయి విపక్షాల కూటమిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండబోదని చెప్పారు. బీజేపీతో కలిసి ఉందని.. ఆ పార్టీ బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు.
పార్టీ పదవులన్నింటినీ ఐదు రోజుల్లో భర్తీ చేయాలని ఆదేశం
పార్టీలో పదవుల అంశంపైనా రాహుల్ సమీక్షించారు. ఖాళీగా ఉన్న బూత్ ఇంచార్జ్ లు.. ఇతర పదవులను ఐదు రోజుల్లో భర్తీ చేయాలని పార్టీ నేతలకు రాహుల్ సూచించారు. వచ్చే 120 రోజుల్లో ఏం చేయాలన్నది ముందుగానే డిసైడ్ చేసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాహుల్ గాంధీతో సమావేశం పూర్తిగా పార్టీ పని తీరు నేతల .. పనితీరుపైనే ప్రధానంగా జరిగింది. కంప్లైంట్లు తీసుకోవడానికి దానిపై చర్చ పెట్టడానికి రాహుల్ ఆసక్తి చూపించలేదు. పైగా తనకు అందరి గురించి తెలుసని చెప్పడంతో.. కంప్లైంట్లతో వెళ్లిన నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని అంటున్నారు.