TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోనూ నిరసనలు మిన్నంటుతున్నాయి. తెలంగాణ టీడీపీ నేతలు ఆందోళనలు ఉధృతం చేశారు. మేడ్చల్ జిల్లాలో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది అక్రమ అరెస్ట్ అంటూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు... తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ర్యాలీలు చేశారు తెలుగు దేశం నేతలు, కార్యకార్తలు. కుత్బుల్లాపూర్ టీడీపీ సీనియర్ నాయకుడు బర్ల శ్రీను ఆధ్వర్యంలో సూరారంలోని కట్ట మైసమ్మ ఆలయానికి బోనాల ఎత్తుకుని ర్యాలీ నిర్వహించారు.
చంద్రబాబు త్వరగా విడుదల కావాలని.. ఆయన ఆరోగ్యంగా ఉండాలని... కట్ట మైసమ్మ ఆలయంలో 1001 కొబ్బరి కాయలు కొట్టారు. అమ్మవారికి బోనాలు కూడా సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన పోవాలని, ప్రజలను పీడిస్తున్న జగన్ ప్రభుత్వం పడిపోవాలని కోరుతున్నారు టీడీపీ నేతలు. ఏపీలో త్వరలోనే టీడీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసి... ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలన్నదే వైసీపీ ప్రభుత్వం కుట్ర అని ఆరోపించారు. అయితే... ఆందోళన చేస్తున్న టీడీపీ నేత బర్ల శ్రీనును సూరారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను స్టేషన్‌కు తతరలించారు.
కూకట్‌పల్లిలోనూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారు టీడీపీ నేతలు. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో టీడీపీ శ్రేణులు,సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో నందమూరి సుహాసిని కూడా పాల్గొన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించారన్నారు నందమూరి సుహాసిని. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన FIRలో చంద్రబాబు పేరు లేదని... పేరు లేకుండానే అరెస్ట్ చేశారన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉన్నా... తీసుకోలేదన్నారు. గవర్నర్ అనుమతి లేకుండానే చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమన్నారు నందమూరి సుహాసిని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబును కుట్రపూరితంగా... సాక్ష్యాలు లేకుండానే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇంత అన్యాయంగా ప్రవర్తించిన జగన్‌మోహన్‌రెడ్డి... భవిష్యత్తులో దీనికి ప్రతిఫలం అనుభవిస్తాడని హెచ్చరించారు. ఐయామ్ విత్ సీబీఎన్, సైకో పోవాలి-సైకిల్ రావాలి. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి, సేవ్ బాబు-సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలతో హోరెత్తించారు టీడీపీ కార్యకర్తలు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు ఐటీ ఉద్యోగులు కూడా పోరాటంలోకి దిగారు. ఛలో రాజమండ్రి అంటూ హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు భారీ కార్ల ర్యాలీని నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు కార్ల ర్యాలీ ప్రారంభమైంది. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి దివంగత నటుడు నందమూరి తారకరత్న సతీమణి నందమూరి అలేఖ్యరెడ్డి, పిల్లలు సంఘీభావం తెలిపారు. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ నేపథ్యంలో విజయవాడ కమిషరేట్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు బోర్డర్‌లో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఐటీ ఉద్యోగుల ర్యాలీని అడ్డుకున్నారు.