Ponguleti Srinivas Reddy: గడప గడపతో గెలుద్దాం, కాంగ్రెస్ రుణం తీర్చుకుందాం: పొంగులేటి పిలుపు
Ponguleti Srinivas Reddy: మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది.
Ponguleti Srinivas Reddy: మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు పెంచింది. ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని అడుగడుగునా ఆ పార్టీ నేతలు ముమ్మర ప్రచారం చేపట్టారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఖమ్మం పట్టణంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టే పథకాల గురించి వివరించారు. బీఆర్ఎస్ వైఫల్యాల గురించి ప్రజలకు తెలియ జేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని, అదే అందరి లక్ష్యం కావాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీ అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యం కావాలని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి వివరించాలన్నారు. బీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.4000ల పెన్షన్, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, అర్హులైన పోడు రైతులకు పట్టాలు పంపిణీ.. వాటికి రుణాలు వచ్చేలా చేయడం, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు చేరాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాటలకే పరిమితమని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణాన్ని తీర్చుకుందామని అన్నారు. ఖమ్మం పట్టణంలోని జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేశారు.
2014, 2018 మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారో కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న లక్ష రుణమాఫీ కేవలం 18 వేల నుంచి 20 వేలు మాత్రమే అన్నారు. అదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ ఒకేసారి చేస్తామన్నారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5 లక్షల గృహ నిర్మాణంకు సాయం చేస్తామన్నారు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అమిత్ షా వస్తే 1000 బస్సులకు ఫర్మిషన్ ఇచ్చిందన్నారు. దీన్ని బట్టి బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అనడానికి ఇది నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్టు షాపులు మూత పడడం ఖాయమన్నారు. ధరణి పేరుతో లక్షల కోట్ల భూములు ఆగం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు.
అక్రమంగా సంపాదించిన డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు వస్తుందన్నారు. ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ సచ్చిపోతదని తెలిసిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధీ అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.