Telangana: ‘బుక్ మై షో’ తరహాలో ‘బుక్ మై సీఎం’ - తెలంగాణలో పోస్టర్ల కలకలం, ఒకరికి మించి మరొకరు పొలిటికల్ పంచ్‌లు!
Poster War In Telangana: తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మూడు పార్టీలు సెప్టెంబర్ 17న సభలు నిర్వహించేందుకు దిగడంతో రాజీకయ సెగ రాజుకుంది. ఈ నేపథ్యంలోనే పోస్టర్లు, బ్యానర్లు వెలుస్తున్నాయి.
Poster War In Telangana: తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న మూడు పార్టీలు సెప్టెంబర్ 17న సభలు నిర్వహించేందుకు దిగడంతో రాజకీయ సెగ రాజుకుంది. ఈ నేపథ్యంలోనే పోస్టర్లు, బ్యానర్లు వెలుస్తున్నాయి. ఓ చోట కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు కట్టారు. అందులో.. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఎస్సీ విభజనపై దళితులను మోసం చేస్తూ వచ్చిందని ఉంది. కొత్తగా ఎస్సీ డిక్లరేషన్‌తో ముందుకు వచ్చిందని, మళ్లీ ఇదే మోసం కావాలా అంటూ అందులో పెద్ద పెద్ద అక్షరాలతో ప్రింట్ చేయించారు. అలాగే సీఎం కేసీఆర్‌పై సైతం ఇదే విధంగా పోస్టర్లు అంటించారు. బుక్ మై సీఎం, డీల్స్ అవైలబుల్ అని, 30 శాతం కమీషన్ అని నగరంలో పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి.
Telangana | Posters seen in Hyderabad ahead of Congress Working Committee (CWC) meeting. pic.twitter.com/oFzzpVTbMm
— ANI (@ANI) September 16, 2023
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ మాటలతో ఎన్నికల వేడి రాజేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో తమ రాజీకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్ పథకాల ఎర వేస్తుండగా, తొలిసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒకరిపై మరొకరు రాజకీయ విమర్శలు ఎక్కు పెడుతున్నారు.
బీఆర్ఎస్ జాతీయ సమైఖ్యతా దినోత్సవం
రాజకీయ ఉనికి, బలా బలాలు ప్రదర్శించుకునేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సెప్టెంబర్ 17ను రాజకీయ వేదికగా చేసుకున్నాయి. బీఆర్‌ఎస్ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ భారత సమాఖ్యలో విలీనమైన 17న జాతీయ సమైక్యత దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారన్న కేటీఆర్ జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి, తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనే ఎత్తుగడలకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఆనాటి చరిత్రతో, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయన్నారు.
తక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ
సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కాంగ్రెస్ CWC సమావేశాలు హైదరాబాద్‌లో జరుతున్నాయి. 17వ తేదీ విజయభేరి పేరిట నిర్వహించనుంది. తుక్కుగూడలో ఆదివారం జరిగే ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. అయితే ముందుగా ఈ సభకు అనుమతులు లభించక రాజకీయ యుద్ధవాతావరణాన్ని తలపించింది. చివరి నిమిషంలో షరతులతో కూడిన అనుమతులను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మంజూరు చేశారు.
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరుపుకోవచ్చని తెలిపారు. అయితే సభకు వచ్చే వారి సంఖ్య 10 వేలకు మించరాదని స్పష్టం చేశారు. సామాన్య పౌరులకు ఇబ్బంది కలగరాదని, ఆ విషయాన్ని నిర్వాహకులే చూసుకోవాలని అన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సీపీ పేర్కొన్నారు. రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేయరాదంటూ 25 షరతులతో కాంగ్రెస్ విజయభేరి సభకు అనుమతి మంజూరు చేశారు.
పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ
కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. రాష్ట్రపతి నిలయంలో కూడా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించనున్నారు. సమైక్యతా దినోత్సవం కాదని, విమోచన దినోత్సవం అంటూ బీజేపీ చెబుతోంది.