Chandrababu in Datti: సంక్షేమంలో ఏపీ నెంబర్ వన్ - 63 లక్షల మందికి పెన్షన్లు - విజయనగరం జిల్లా పేదల సేవలో చంద్రబాబు
Andhra Pradesh: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వనంత ఎక్కువగా పెన్షన్లు ఇస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజా సంక్షేమంలో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు.

Andhra Pradesh CM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయనగరం జిల్లా గజపతినగరం మండలం దత్తి గ్రామంలో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుడు పొంతూరు అప్పలరాజు ఇంటికెళ్లి పింఛను అందించారు. 'సూపర్ సిక్స్ సూపర్ హిట్'గా మారిందని, దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమమని ముఖ్యమంత్రి తెలిపారు. ఉదయం 11 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా 82 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.
విశాఖపట్నం నుంచి హెలికాప్టర్‌లో దత్తి గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజ వేదికలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రసంగించారు. గ్రామంలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితరులకు ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలు విన్నారు. ఎన్‌టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. "అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నాం. 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చాం" అని చెప్పారు. ఏటా రూ.32,143 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజాభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు. పెన్షన్ పెంచడం, ఒకటో తేదీ సెలవు రోజు ముందు రోజు పంపిణీ చేయడం వంటి చర్యలు దేశ చరిత్రలో మొదటిసారి అంటూ ప్రస్తావించారు. "పేదల సేవ దేవుని సేవ" అనే సూత్రంతో పని చేస్తున్నామని, ఈ పథకం పేదలకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. దేశంలో 29 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం రూ.500 పెన్షను మాత్రమే ఇస్తున్నారని, ఆంధ్రంలో మాత్రం వందలో 13 మందికి (59% మహిళలు) పెన్షన్లు అందుతున్నాయని వివరించారు.
ఒక్క పెన్షన్లతోనే సరిపోకుండా 'సూపర్ సిక్స్ సూపర్ హిట్' పథకాలన్నీ అమలు చేశామని చెప్పారు. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అందించామని, ఇప్పుడు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, 45 రోజుల్లో 10 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. "రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు" అని గుర్తు చేశారు.
ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించిన సీఎం, "రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు ఆదాయం పెరగాలి" అని అన్నారు. ఒకప్పుడు రైతును పట్టించుకోలేదని, ఆహారపు అలవాట్లు మారాలని సూచించారు. విజయనగరం జిల్లా పేదరికంలో ఉందని, తగిన సాగునీరు లేదని, కానీ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఇప్పటికే ఒక్కొక్క రైతుకు రూ.6 వేలు వేశామని, మరో రూ.14 వేలు వేస్తామని ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించామని చెప్పారు. "యువతకు అండగా ఉంటా. ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది" అని స్పష్టం చేశారు.
గజపతినగరం నియోజకవర్గం, దత్తి గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుడు పొంతూరు అప్పలరాజు ఇంటికెళ్లి పింఛను అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు pic.twitter.com/qfnJB5bgKr
— Telugu Desam Party (@JaiTDP) October 1, 2025
15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని, ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధికి కట్టుబడి ఉందని, పేదల సేవ దేవుని సేవ అనే సూత్రంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.





















