Amaravati High Speed Corridor: అమరావతికి హైస్పీడ్ కారిడార్.. కోల్‌కతా-చెన్నై హైవేకి సమాంతరంగా నిర్మించనున్న కేంద్రం
AP Capital Amaravati | కోల్‌కతా- చెన్నై మధ్య ఉన్న నేషనల్ హైవేకి సమాంతరంగా ఓ హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) చర్యలు చేపట్టింది.

High speed corridor in between Kolkata to chennai | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లు, మౌలిక వసతుల కల్పన, హైస్పీడ్ కారిడార్లపై ఫోకస్ చేసింది. ఎప్పటికప్పుడూ కేంద్ర ప్రభుత్వంతో వందే భారత్ రైళ్లు పెంచడం, బుల్లెట్ రైలు అవకాశాలపై చర్చలు జరుపుతూనే.. రాష్ట్రంలో వీలున్నచోట హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీకి మరో హైస్పీడ్ కారిడార్ రానుంది. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి-16 ఏపీ మీదుగా వెళ్తుండగా.. దీనికి సమాంతరంగా ఒక కొత్త హైవే నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) నిర్ణయం తీసుకుంది.
ఏపీ మీదుగా గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్
పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు రాజధాని చెన్నైకి గ్రీన్‌ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఎలైన్‌మెంట్‌పై మోర్త్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం సలహా సంస్థను ఎంపికచేసి, హైవే ఎలా నిర్మించాలనే దానిపై అధ్యయనం చేయించనుంది. ఇప్పటికే కోల్‌కతా-చెన్నై హైవేలో భాగంగా కత్తిపూడి-కాకినాడ నుంచి ఒంగోలు వరకు జాతీయ రహదారి 216 ఉంది. కేంద్రం తాజాగా కోల్‌కత్తా నుంచి చెన్నై మధ్య హైస్పీడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త హైవే విశాఖపట్నం సిటీకి సమీపం నుంచి వెళ్లుంది.

విజయవాడ సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌తో హైస్పీడ్ కారిడార్ కలపనున్నారు. తద్వారా గుంటూరు అవతల అదే ఔటర్ రింగ్ రోడ్ నుంచి మిగిలిన భాగం కొనసాగుతుంది. ఆ మార్గాన్ని చెన్నై వరకు నిర్మించకపోయినా, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మధ్య కోల్‌కతా-చెన్నై హైవేలో కలపాలని మోర్త్ ప్లాన్ చేసింది. దీన్ని పూర్తి స్థాయిలో చెన్నై వరకు కొనసాగిస్తేనే గ్రీన్‌ఫీల్డ్‌తో పాటు, యాక్సెస్ కంట్రోల్ హైవే నిర్మాణం జరుగుతుందని భావిస్తున్నారు.
హైస్పీడ్ కారిడార్‌తో అభివృద్ధికి ఊతం..
ప్రస్తుత కోల్‌కతా-చెన్నై హైవే మీద వాహనాల రద్దీ అధికంగా ఉంది. రోజురోజుకూ విపరీతంగా రద్దీ పెరుగుతుండటంతో ఈ హైవే అవసరం ఉంది. కానీ పూర్తి మార్గంలో ఆరు వరుసలు నిర్మించ లేదు. కొన్ని ప్రాంతాల్లో 4 లేన్లు మాత్రమే ఉన్నాయి. దాంతో వాహనాలు వేగంగా వెళ్లే అవకాశం లేదు. ఈ కారణంతో కోల్‌కతా- చెన్నై హైవేకి సమాంతరంగా మరొక హైస్పీడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే వాహనదారులకు భారీ ఊరట కలుగుతుంది. ఈ హైవే కొత్త ప్రాంతాల మీదుగా వెళ్లడంతో అవి అభివృద్ధి చెందేందుకు అవకాశాలుంటాయి.
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 7 హైవేల మీదుగా వెళ్తుంది కనుక అభివృద్ధి జరిగేందుకు వీలుంటుంది. హైస్పీడ్ కారిడార్ అందుబాటులోకి వస్తే ఉత్తర, తూర్పు భారత్.. దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేస్తుందని మోర్త్ భావిస్తోంది. విజయవాడ, అమరావతి చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు హైస్పీడ్ కారిడార్ వెళ్లే సమీపం ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. కొత్త కంపెనీలు, పరిశ్రమలు వస్తాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అమరావతికి మరింత ప్రయోజనం చేకూర్చుతుంది. నెల రోజుల్లో ఈ హైస్పీడ్ కారిడార్‌పై స్పష్టత రానుంది. మోర్త్ ఉన్నతాధికారులు ప్రాజెక్టు ఎలైన్‌మెంట్ల తయారీని పరిశీలిస్తున్నారు. ఎలైన్‌మెంట్ మీద కసరత్తు పూర్తయితే ఖరగ్‌పూర్- చెన్నై హైస్పీడ్ కారిడార్ వెళ్లే రాష్ట్రాల ప్రభుత్వాలతో సమావేశమై, వారి పర్మిషన్, అభ్యంతరాలు స్వీకరించి తుది ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. ప్రాజెక్టు వ్యయం, భూసేకరణ కీలకం కానున్నాయి.






















