Pithapuram News: పిఠాపురం జనసేనలో అంతర్గత విభేదాలకు కారణమేంటి? మర్రెడ్డి శ్రీనివాసరావు మార్పు తప్పదా?
Pithapuram News: పిఠాపురంలో అంతర్గత అసంతృప్తి తీవ్రమవుతోంది. ఇంచార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న మర్రెడ్డి శ్రీనివాస్ కూడా కారణమా అన్న అనుమానం కలుగుతోంది.

Pithapuram News: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఇంచార్జ్ ఎవ్వరు అనేదానిపై పెద్ద డౌట్ వ్యక్తం అవుతోంది.. ఎందుకంటే పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తోన్న మర్రెడ్డి శ్రీనివాసరావును ఆ బాద్యతల నుంచి తప్పిస్తున్నారన్న ప్రచారం స్థానికంగా జోరుగా సాగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.. స్థానికంగా ఆయనపై పార్టీలో ఉన్న అసంతృప్తే ఆయన పెద్దగా చురుగ్గా ఉండడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.. అయితే ఆయనకు పార్టీ అధినేత నుంచి పుష్కలంగా ఆశీస్సులు ఉండడం, ఆయనపై అధిష్టానానికి సానుకూలత ఉండడంతో ఆయన ముందుండి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. అయితే గత కొంత కాలంగా ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై వస్తున్న పుకార్ల ఈనేపథ్యంలోనే ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన జనసేన ముఖ్యనేత, ఎమ్మెల్సీ హరిప్రసాద్ విలేకరులు అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చారు.
తారాస్థాయికి చేరుకున్న విభేదాలు
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీలో ముందునుంచి అన్నీతామే వ్యవహరించిన వారిని పక్కన పెట్టారని, కొత్తగా వైసీపీలో నుంచి, ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వారిని పార్టీలో ప్రాముఖ్యత ఇస్తున్నారని ముందునుంచి కొంత మందిలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ఇది నియోజకవర్గంలో పలు సందర్భాల్లో బట్టబయలైంది.. ఇది చేబ్రోలు సీతారామాలయంలోని జే గంట విషయంలో బయటపడింది. అయితే ఇటువంటి సందర్భాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, లేక ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఇలా ఎవరో ఒక నేతలు వచ్చి సర్ధి చెప్పడం పరిపాటిగా మారింది..
ఇక్కడ విషయాలన్నీ జనసేనాని దృష్టికి వెళ్లడం లేదని, తమ గోడు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియడం లేదని చాలా మంది జనసేన పార్టీ నేతలే లోలోన మధనపడిన పరిస్థితులున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది..దీనికి తోడు నియోజకవర్గ ఇంచార్జ్ స్థానికంగా లేకపోవడం, ఆయన ఏదైనా సమావేశాలుంటేనే హాజరయ్యే పరిస్థితి ఉండడం తమ ఇబ్బందులను ఎవ్వరికి చెప్పుకోవాలో అర్ధంకాని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని జనసేన నేతలు వాపోయిన పరిస్థితి కూడా కనిపించింది.. ఈనేపథ్యంలో జనసేన పార్టీ ఇంచార్జ్ మార్పు జరిగనుందా..? అందుకే నియోజకవర్గంలో ఈరకమైన వార్తలు హల్‌చల్ చేస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి...
జనసేన ఇంచార్జ్ ఆయనే అంటూ తేల్చిచెప్పిన ఎమ్మెల్సీ హరిప్రసాద్..
ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన జనసేన పార్టీ కీలకనేత, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. నియోజకవర్గ ఇంచార్జ్ మార్పు విషయంలో ప్రస్తుతానికి అటువంటి ఆలోచన ఏమీ లేదన్నారు. పార్టీలో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉండడం సహజమేనని, అవన్నీ సర్దుకుంటాయని స్పష్టం చేశారు. ఉప్పాడలో మత్స్యకారుల నిరసన చేపట్టిన నేపథ్యంలో ఆయన వారి నిరసనపై కూడా స్పందించారు. వారి సమస్యలపై నిరసన తెలిపడం వారి హక్కు అని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నారన్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తారని, రెండు మూడు వారాల్లో పిఠాపురంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నాయన్నారు.. మత్స్యకారుల ఆందోళనను సహృదయంతోనే తీసుకుంటున్నామన్నారు.. ఆ సమస్యపై మట్లాడాల్సింది డిప్యూటీ సీఎం మాత్రమేనన్నారు.
త్వరలోనే పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి మత్స్యకారుల సమస్యలపై వారితో మాట్లాడనున్నారని వెల్లడించారు.
మండల కమిటీలు, గ్రామ కమిటీలు మార్పు అనివార్యం..?
పిఠాపురం నియోజకవర్గంలో త్వరలోనే మండల, గ్రామ కమిటీల మార్పు అనివార్యంగా కనిపిస్తోంది.. సుధీర్ఘకాలంగా మండల, గ్రామ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నవారిలో కొంతమందిని పక్కనపెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.. రాబోయే రెండు వారాల వ్యవధిలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ అంశం కూడా తెరమీదకు రాబోతున్నట్లు తెలుస్తోంది..






















