KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Telangana News | తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్ లో మంగళవారం భేటీ అయ్యారు. కొందరు పార్టీ మారితే బీఆర్ఎస్ కు నష్టం లేదన్నారు.
హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీఆర్ఎస్‌కు ఎలాంటి నష్టం లేదని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం (జూన్ 25న) సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై, పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఈ సందర్భంగా చర్చించారు. బీఆర్ఎస్ నేతలు వరుసగా పార్టీని వీడుతున్న తరుణంలో పార్టీ అధినేత నిర్వహించిన సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సీనియర్ నేత పోచారం సహా ఆయన కుమారుడు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కొందరు నేతలు పార్టీ మారితే బీఆర్ఎస్ కు ఏ నష్టం లేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ హయాంలో ఇలాంటివి జరిగితే భయపడలేదన్నారు కేసీఆర్. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేతలు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వీడితే భయపడేది లేదన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు బీఆర్ఎస్ పార్టీని వీడటాన్ని అంతగా పట్టించుకోవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఎటు చూసినా కరెంట్ కోతలు ఉన్నాయని, బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. మరోవైపు తెలంగాణలో ఎటుచూసినా శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ అధినేత ఆరోపించారు. ఎన్నికల సమయంలో అమలు అసాధ్యమైన ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ గద్దెనెక్కిన తరువాత అన్నీ మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని ప్రజల పక్షాన నిలిచి, వారి సమస్యలపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఇకపై వీలు చూసుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను తరచూ కలుస్తానని మాజీ సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ నేతల సమావేశంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రులు టి.హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డిలతో పాటు మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, ముఠా గోపాల్, టి. ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు దండే విఠల్, శేరి సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు కేసీఆర్ ను కలిసి పార్టీ పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవాలో చర్చించారు. మరోవైపు బీజేపీ పుంజుకోవడంతో బీఆర్ఎస్ అధినేతకు ఏం తోచడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దేశానికి ప్రధాని కావాలని కలలు కన్న కేసీఆర్.. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు కూడా నెగ్గకపోవడం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలో ఏం జరుగుతోందని చర్చ జరిగింది.