PM Modi: ఎన్నికల శంఖారావం - తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన, పూర్తి షెడ్యూల్ ఇదే!
Telangana News: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ముమ్మరం చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ శుక్రవారం నుంచి తెలంగాణలో ప్రచారంలో పాల్గొననున్నారు.
PM Modi Tour in Telangana: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రచారానికి సమాయత్తం అవుతోంది. కేంద్రంలో మళ్లీ అధికారం చేజెక్కించుకోవడం సహా తెలుగు రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలనే పట్టుదలతో బీజేపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన ఖరారైంది. గత వారంలో అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి ప్రచారం చేసిన మోదీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించారు. పది రోజుల వ్యవధిలోనే రెండోసారి రాష్ట్రానికి రానున్న ప్రధాని.. 3 రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇటీవల నగర శివార్లలోని పటాన్ చెరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించిన బీజేపీ.. మల్కాజిగిరి స్థానంపై ఎక్కువగా ఫోకస్ చేసింది. సికింద్రాబాద్ సిట్టింగ్ సీటుతో పాటు చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలపై కమలదళం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో శుక్రవారం (మార్చి 15) హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ.. మల్కాజిగిరి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం సాయంత్రం మీర్జాల్ గూడ నుంచి మల్కాజిగిరి వరకూ రోడ్ షో నిర్వహించనున్నారు. అలాగే 16న (శనివారం) నాగర్ కర్నూల్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. 18న (సోమవారం) జగిత్యాలలో బహిరంగ సభలోనూ ప్రధాని పాల్గొననున్నారు.
మూడు చోట్ల బహిరంగ సభలు
మోదీ పర్యటన సందర్భంగా జగిత్యాల, నాగర్‌కర్నూల్, మల్కాజిగిరిల్లో సభల నిర్వహణకు రాష్ట్ర పార్టీ సన్నాహాలు ప్రారంభిస్తున్నట్టు పార్టీ నాయకులు తెలిపారు. ఒక్కో చోట నిర్వహించే బహిరంగ సభలో రెండు, మూడు లోక్‌సభ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జగిత్యాల సభలో నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలు, నాగర్‌కర్నూల్ బహిరంగ సభలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మల్కాజిగిరి సభలో భువనగిరి, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాలు కవరయ్యేలా కార్యక్రమాన్ని పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
భారీ భద్రత
పీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మీర్జాల్ గూడ నుంచి మల్కాజిగిరి క్రాస్ రోడ్ వరకూ 5 కిలో మీటర్ల మేర పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ లను ఎగురవేయడానికి అనుమతి లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశించారు. భాగ్యనగర వ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.
17న చిలుకలూరిపేట సభకు మోదీ
చిలకలూరిపేట (Chilakaluripet)లో ఈ నెల 17న జరగనున్న టీడీపీ (TDP), బీజేపీ (BJP), జనసేన (Janasena) మూడు పార్టీల ఉమ్మడి సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) హాజరు కానున్నారు. సభను జయప్రదం చేసేందుకు 13 కమిటీలను టీడీపీ నియమించింది. ఈ సభ నిర్వహణ, కమిటీలతో సమన్వయ బాధ్యతను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)కు తెలుగుదేశం హైకమాండ్ అప్పగించింది. ఇప్పటికే నరేంద్ర మోదీ పర్యటనను ప్రధాని కార్యాలయం ఖరారు చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కమిటీల నియామకం జరిగింది.